‘నర్తనశాల’లో దివంగత సౌందర్య ‘ద్రౌపది’ లుక్ విడుదల…!

0

నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబులతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న తర్వాత హీరోయిన్ సౌందర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అయితే అప్పట్లో చిత్రీకరించిన 17 నిమిషాల సన్నివేశాలను దసరా కానుకగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేయనున్నట్టు బాలకృష్ణ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో ‘నర్తనశాల’ నుంచి అర్జునుడిగా బాలయ్య మరియు భీముడిగా రియల్ స్టార్ శ్రీహరి లుక్ ని రిలీజ్ చేశారు.

ఈ క్రమంలో తాజాగా ద్రౌపది పాత్రలో నటించిన దివంగత సౌందర్య లుక్ ని విడుదల చేశారు. సౌందర్య ద్రౌపది పాత్రలో ఒదిగిపోయి నటించిందని ఈ పోస్టర్ లో ఆమెను చూస్తే అర్థమవుతోంది. దక్షిణాదిలో వందకు పైగా చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న సౌందర్యని ‘నర్తనశాల’ రూపంలో మరోసారి చూడబోతున్నామని అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. బాలయ్య స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘నర్తనశాల’ 17 నిమిషాల సన్నివేశాలను ఎన్బికె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు.