ఆ యంగ్ హీరో సినిమా పిచ్చి నాన్నగారికి నచ్చదా?

0

సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ దాంతో పాటే పిచ్చి వ్యాపకాలు అనుకునేవాళ్లే ఎక్కువ. ఏదైనా బిజినెస్ రంగం కానీ స్పోర్ట్స్ రంగంలో కానీ ఉన్న వాళ్లు ఇటువైపు వస్తే ఇంట్లో అందరికీ నచ్చుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఆయా రంగాల్లో ఉన్న సక్సెస్ రేటు ఇక్కడ అస్సలు ఉండదు. కేవలం 5 శాతం సక్సెస్ మాత్రమే గ్యారెంటీ. మిగతాది అంతా ఎంతో చేస్తే కానీ అదృష్టం కలిసొస్తే కానీ అందనివి.

అయితే గత దశాబ్ధ కాలంగా సుధీర్ బాబు హీరోగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ కి బావ అన్న మాటే కానీ సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలన్న పంతంతోనే అతడు ప్రతిసారీ ప్రయత్నిస్తున్నారు. కానీ సక్సెస్ అందని మావే అయ్యింది. తాజాగా నానీతో కలిసి సుధీర్ బాబు నటించిన `వి-ద మూవీ` రిలీజైంది. ఈ థ్రిల్లర్ మూవీకి మిశ్రమ స్పందనలు వచ్చినా సుధీర్ బాబు కాప్ రోల్ కి ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు కురిసాయి.

ఇదే విషయాన్ని ట్విట్టర్ లో చెప్పుకుంటూ.. సుధీర్ బాబు ఎంతో ఎమోషనల్ గా స్పందించారు. చాలా కాలం తర్వాత సినిమాలంటే ఏమాత్రం గిట్టని తన నాన్న గారి నుంచి ఒక రిప్లయ్ వచ్చిందట. చాలా బావుంది బాగా చేశావ్ అని అందరి నుంచి మెసేజ్ లు వస్తున్నాయని అన్నారట. అమ్మా నాన్న ఇద్దరికీ మెసేజ్ లు వెల్లువెత్తుతుంటే ఆ ఆనందాన్ని తనతో షేర్ చేసుకున్నారని మళ్లీ మళ్లీ వెక్కి ఏడ్చానని కూడా సుధీర్ బాబు అనడం చూస్తుంటే నిజానికి బ్యాడ్మింటన్ ప్లేయర్ గా గొప్ప ప్రొఫెషన్ ని వదిలేసి గ్లామర్ రంగం వైపు వచ్చిన కొడుకుని మనస్ఫూర్తిగా ఆయన తండ్రి గారు అంగీకరించలేకపోయారన్నది అర్థమవుతోంది.

ఎంతైనా క్రీడారంగాన్ని మించి గ్లామర్ రంగంలో సక్సెస్ ఉండదు. అది తెలిసిన తండ్రిగా ఆయన ఆవేదన అదే అయ్యుండొచ్చు. అయినా సుధీర్ బాబు నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టైలిష్ గా మేకోవర్ సాధిస్తున్న తీరు బావుంది. పెద్ద స్టార్ గా ఎదిగేందుకు ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. దానికి ఓపిక కావాలి మరి.