సందీప్ కిషన్ స్పోర్ట్స్ డ్రామా ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ షూటింగ్ పూర్తి..!

0

టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”ఏ1 ఎక్స్ ప్రెస్”. జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఆమె కూడా హాకీ క్రీడాకారిణిగా కనిపిస్తారని తెలుస్తోంది. తెలుగులో గ్రాండ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. కోవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలతో షూటింగ్ జరిగి సినిమాని కంప్లీట్ చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సందీప్ కిషన్ స్టేడియంలో నటుడు రాహుల్ రామకృష్ణ తో ఉన్న ఓ వీడియోని కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో హాకీ ప్లేయర్ గా ఉన్న సందీప్ గోల్ కొడుతూ కనిపించాడు.

కాగా ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ పతాక సన్నివేశాలను చండీగఢ్ లోని మొహాలీ నేషనల్ స్టేడియంలో చిత్రీకరించారని తెలుస్తోంది. ఇంతకముందు హాకీ నేపథ్యంలో షారూఖ్ ఖాన్ నటించిన ‘చక్ దే ఇండియా’ సినిమా షూటింగ్ కూడా ఇదే స్టేడియంలో జరుపుకుంది. ఇక స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే సినిమా కావడంతో సందీప్ కిషన్.. పర్ఫెక్ట్ హాకీ ప్లేయర్ గా కనిపించడం కోసం కొన్నాళ్లు ఆటలో శిక్షణ తీసుకున్నారు. అలానే డైలీ కఠినమైన వర్కౌట్స్ చేస్తూ సందీప్ ఈ చిత్రం కోసం 12 కిలోల బరువు తగ్గాడు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి త్వరలో అనేక సర్ప్రైజులు రాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజ సంగీతం సమకూరుస్తున్నారు. మురళీ శర్మ – రావు రమేష్ – రాహుల్ రామకృష్ణ – మహేష్ విట్టా – ఖయ్యూమ్ – భూపాల్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ – వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ – సందీప్ కిషన్ – దయా పన్నెం కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.