‘నా సొంత విషయాలు త్రివిక్రమ్ ఒక్కడికే చెప్తా’

0

నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన బండ్ల గణేష్.. ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసే రేంజ్ కి ఎదిగాడు. సినిమాలతోనే కాకుండా తన మాటలతోటి వ్యవహారశైలి తోటి వార్తల్లో నిలుస్తుంటాడు. ముక్కుసూటిగా మనసుకు ఏది తోస్తే అది మాట్లాడుతూ అప్పుడపుడు విమర్శలకు గురి అవుతుంటాడు. అయితే ఇటీవల కరోనాని జయించిన బండ్ల గణేష్ మునుపటిలా ఆవేశంగా మాట్లాడటం లేదు. ఈ క్రమంలో లేటెస్టుగా సీనియర్ కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న ఓ షోలో పాల్గొన్న బండ్ల గణేష్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ”త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నువ్వు బాగా క్లోజ్ గా ఉంటూ ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా షేర్ చేసుకుంటావు. అలాంటిది ఆయనతో సినిమా ఎందుకు చేయలేదు?” అని అలీ ప్రశ్నించాడు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ”నేను నిర్మించిన ‘తీన్ మార్’ సినిమాకి ఆయనే రైటర్.. త్రివిక్రమ్ చాలా విధాలుగా నాకు సపోర్ట్ చేశారు. నాతో కచ్చితంగా ఒక సినిమా చేస్తా అన్నారు. చేస్తారు. నా మనసు బాగాలేనప్పుడు టెన్షన్ లో ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడతాను. సాధారణంగా ఆయన ఫోన్ ఎత్తడు. ఆయనే రెండు రోజులకో మూడు రోజులకో చేస్తారు. చూసుకోలేదు స్వామి అంటాడు. ఆయన నాకు ఏది చెప్పినా 90 శాతం కరెక్ట్ అవుతుంది. నా సొంత విషయాలు ఆయన ఒక్కడికే చెప్తా. మనం వేరే వాళ్లకు ఏదైనా విషయం చెప్తే ఉపయోగం సంగతి పెట్టు నష్టాలే ఎక్కువ ఉంటాయని నేను భావిస్తా. అదే ఆయనతో చెప్తే బ్యాంక్ లాకర్ లో వేసినట్లే” అని త్రివిక్రమ్ తో ఉండే అనుబంధం గురించి వివరించాడు. అయితే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో క్లోజ్ గా ఉంటాడని అందరికి తెలుసు. ఇక త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్ అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా బండ్ల గణేష్ – త్రివిక్రమ్ కూడా క్లోజ్ గా ఉంటారని తెలుస్తోంది. బండ్ల గణేష్ చెప్తున్నట్లు త్రివిక్రమ్ సినిమా చేసి పెడతాడేమో చూడాలి.