ప్రభాస్ సలార్ తో పోటీ ఉండటం వల్ల మన ప్రేక్షకుల దృష్టి షారుఖ్ ఖాన్ డుంకీ మీద కూడా ఉంది. ముందు విడుదల తేదీ ప్రకటించింది ఇదే అయినప్పటికీ అనూహ్య పరిణామాల తర్వాత డార్లింగ్ సైతం అదే డేట్ ని తీసుకోవాల్సి వచ్చింది. అయితే డుంకీ కంటెంట్ ఎలా ఉండబోతోందనే దాని మీద ఆడియన్స్ లో ఎగ్జైట్ మెంట్ ఉంది. పైగా ఒకే సంవత్సరం రెండు వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్లు పఠాన్, జవాన్ రూపంలో అందుకున్న షారుఖ్ ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాడనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. ఇవాళ హీరో పుట్టినరోజు సందర్భంగా డ్రాప్ 1 పేరుతో టీజర్ ని రిలీజ్ చేశారు.
కథని ఎక్కువ రివీల్ చేయకుండా తెలివిగా కట్ చేయించారు. ఎక్కడో సుదూరంగా ఎడారి లాంటి ప్రాంతంలో తనలాంటి వాళ్ళతో కలిసి ఒంటరిగా నడుస్తున్న హార్దీ(షారుఖ్) గుంపు వెనుక నుంచి ఓ దుండగుడు కాల్పులు జరుపుతాడు. అప్పుడతని గతమేంటో ఓపెనవుతుంది. ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు, ఓ అమ్మాయి(తాప్సీ పన్ను) ఇంగ్లాండ్ వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే అది తమ మతాచారానికి వ్యతిరేకమని పెద్దలు వాదిస్తూ ఉంటారు. వాళ్ళను కాదని హార్దీ బృందం ఏం చేసిందిందనేది తెరమీద చూడాలి.