పవన్ కళ్యాణ్ కోసం ఆ ఇద్దరు మళ్ళీ కలుస్తున్నారా…?

0

టాలీవుడ్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి – రైటర్ వక్కంతం వంశీ కాంబోలో మంచి క్రేజ్ ఉంది. సురేందర్ రెడ్డి రెండో సినిమా ‘అశోక్’ నుంచి వక్కంతం వంశీతో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సూరి దర్శకత్వం వహించిన ‘అశోక్’ ‘అతిథి’ ‘ఊసరవెల్లి’ ‘రేసుగుర్రం’ ‘కిక్’ ‘కిక్ 2’ సినిమాలకు వక్కంతం వంశీ స్టోరీలు అందించాడు. ఒకవైపు సురేందర్ రెడ్డితో కలిసి సినిమాలు చేస్తూనే వంశీ మధ్యలో ‘టెంపర్’ ‘ఎవడు’ ‘టచ్ చేసి చూడు’ వంటి స్టోరీలను వేరే దర్శకులకు అందించాడు. అయితే వక్కంతం వంశీ డైరెక్టర్ కావాలనే కళను ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో నెరవేర్చుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలిపోయింది. అప్పటి నుంచి వక్కంతం మరో సినిమాని డైరెక్ట్ చేయలేదు. ఇక సురేందర్ రెడ్డి ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలవబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందని.. పవన్ స్నేహితుడు రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతిని తెలిసిందే. అయితే ఈ సినిమాకి వక్కంతం వంశీ స్టోరీ అందిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ ని దృష్టిలో పెట్టుకొని ఓ స్టోరీ రెడీ చేసాడట. అయితే ఈ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కెరీర్లో 29వ చిత్రంగా రూపొందే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వకీల్ సాబ్’ మరియు క్రిష్ సినిమాలతో పాటు హరీష్ శంకర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతే సురేందర్ రెడ్డి సినిమా పట్టాలెక్కుతుందట. ఈలోపు సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ తో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. మరి ఈ సురేందర్ రెడ్డి – వక్కంతం వంశీ – పవన్ కళ్యాణ్ కలయికలో రాబోయే సినిమాపై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.