‘సామ్ జామ్’ టాక్ షో కి గెస్ట్ గా రౌడీ..!

0

ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహా కోసం స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ‘సామ్ జామ్’ అనే స్పెషల్ టాక్ షో కి హోస్ట్ గా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ టాక్ షో గురించి ఆహా టీమ్ అధికారికంగా వెల్లడించారు. ప్రముఖ లేడీ దర్శకురాలు నందిని రెడ్డి దీనిని నిర్వహిస్తారు. ‘ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదని.. సమాజంలోని సమస్యల గురించి ప్రశ్నించడం.. టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం వంటివి ఇందులో ప్రేక్షకులు చూడవచ్చని సమంత తెలిపింది. దీపావళి సందర్భంగా ఈ నెల 13వ తేదీ నుంచి ఈ టాక్ షో ప్రసారం అవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ షో లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను సమంత తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయనుంది. ఈ నేపథ్యంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ టాక్ షో కి గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ‘సామ్ జామ్’ కార్యక్రమానికి తాజాగా విజయ్ దేవరకొండ హాజరైనట్లు తెలుస్తోంది. విజయ్ ఈ షో కోసం వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ ఈ ఫోటోలలో సిల్వర్ కలర్ సూట్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ ని అక్కినేని సమంత ఇంటర్వ్యూ చేయబోతున్నారని స్పష్టమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి – అల్లు అర్జున్ – తమన్నా భాటియా – రష్మిక మందన్న – సైనా నెహ్వాల్ వంటి సెలబ్రిటీలను త్వరలో అక్కినేని సమంత ఇంటర్వ్యూ చేయనుంది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ‘ఆహా’ లో ప్రసారం కానుంది.