వెబ్ సిరీస్ దారిలో మరో స్టార్ హీరో

0

హాలీవుడ్ నుండి మొదలుకుని అన్ని భాషల్లో కూడా ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇండియాలో వెబ్ సిరీస్ లకు ఈ స్థాయి ఆధరణ రావడానికి కనీసం అయిదు ఏళ్లు పడుతుందని అనుకున్నారు. కాని కరోనా కారణంగా ఓటీటీలకు ఆధరణ పెరిగింది. అయిదు ఆరు నెలలుగా థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లే పరిస్థతి లేదు. ఆ కారణంగానే వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు ఆధరించడం.. ఓటీటీ మూవీలను చూసేందుకు ఆసక్తి చూపడం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో స్టార్స్ హీరోలు మరియు హీరోయిన్స్ చాలా మంది ఓటీటీ కోసం నటించేందుకు సిద్దం అవుతున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఒక భారీ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇక సౌత్ లో కూడా పలువురు స్టార్స్ వెబ్ కంటెంట్ లో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ సమయంలోనే తమిళ స్టార్ హీరో విక్రమ్ కూడా ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడట. ప్రముఖ బ్యానర్ లో ప్రముఖ దర్శకుడు రూపొందించబోతున్న వెబ్ సిరీస్ లో విక్రమ్ నటించబోతున్నాడు. హిందీ మరియు తమిళంలో ఆ వెబ్ సిరీస్ ను రూపొందించి ఇండియాలోని అన్ని భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారట.

ఈయన ప్రస్తుతం నటిస్తున్న కోబ్రా సినిమా షూటింగ్ ఈ ఏడాదిలో ప్రారంభం అయ్యే అవకాశం కనిపించడం లేదు. సినిమా భారీగా ఉంటుంది కనుక ఇప్పట్లో షూటింగ్ ను మొదలు పెట్టడం కష్టం అని వచ్చే ఏడాది ఆరంభం నుండి షూటింగ్ ఉంటుందని అంటున్నారు. ఇక కొడుకు ధృవ్ తో కూడా ఈయన ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు ప్రారంభించే అవకాశం లేదు. కనుక మూడు నాలుగు నెలల్లో ఈ వెబ్ సిరీస్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. విక్రమ్ తర్వాత మరెంత మంది స్టార్స్ ఓటీటీ దారి పట్టేనో చూడాలి.