డ్రగ్స్ వివాదంపై ఈ మౌనమేల రకుల్…?

0

బాలీవుడ్ – శాండల్ వుడ్ లలో రేగిన డ్రగ్స్ మంటలు.. టాలీవుడ్ నూ తాకాయి. డ్రగ్స్ వ్యవహారం లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లో డ్రగ్స్ ఆరోపణలు రావడం కొత్తేమీ కానప్పటికీ.. ఈసారి స్టార్ హీరోయిన్ పై ఆరోపణలు రావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో రియా.. డ్రగ్స్ తో సంబంధమున్న పలువురు సెలబ్రిటీల పేర్లు చెప్పిందని.. అందులో సారా అలీఖాన్ – రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ఉన్నాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు ఇతర ఇండస్ట్రీలలో డ్రగ్స్ మాఫియా గురించి వింటూ వస్తున్న టాలీవుడ్ జనాలు షాక్ అయ్యారు. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా రకుల్ ని ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు.

అదే సమయంలో ఎన్సీబీ లో కీలక పదవిలో ఉన్న ఓ అధికారి.. డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తి రకుల్ ప్రీత్ సింగ్ – సారా అలీఖాన్ ల పేర్లు వెల్లడించిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. రియా ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏ హీరోయిన్ పేరు లేదని.. కేవలం డ్రగ్స్ పెడ్లర్లు మరియు స్మగ్లర్ల పేర్లు మాత్రమే చెప్పిందని సదరు అధికారి చెప్పినట్లు న్యూస్ వచ్చింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ మద్ధతుగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘సారీ రకుల్’ అంటూ పోస్టులు పెడుతూ ట్రెండ్ చేశారు. సినీ ఇండస్ట్రీలోని చాలామంది రకుల్ కు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఎన్సీబీ డైరెక్టర్ మల్హోత్రా జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్.. సారా అలీఖాన్ పేర్లు ప్రచారం అయ్యాయి. ఇందులో నిజా నిజాలేమిటి? తదుపరి చర్యలేమిటి అన్న దానిపై మేం ఇంకా ఏదీ చెప్పలేం. అనవసర వ్యాఖ్యలు చేయలేం’ అని చెప్పినట్లు మరో న్యూస్ వచ్చింది. దీంతో రకుల్ పేరు ఆ జాబితా లో ఉన్నట్లా లేనట్లా అని మళ్ళీ అందరూ ఆలోచించడం స్టార్ట్ చేశారు.

అయితే ఇంత జరుగుతున్నా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం దీనిపై స్పందించలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే రకుల్.. కనీసం దీనిపై స్పందిస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో ఆమె అభిమానులు కలవరపడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు రకుల్ మాత్రం ఈ విషయంపై సైలెన్స్ మైంటైన్ చేస్తూ తన సినిమా షూటింగులు చేసుకుంటోందని సమాచారం. అయితే సైలెంటుగా ఉండకుండా డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు రావడాన్ని ఖండిస్తూ రకుల్ ఓ ట్వీట్ చేస్తే బాగుంటుందని.. లేకపోతే దీని పై అందరూ మరోలా ఆలోచించే అవకాశం ఉందని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు.