Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> తిప్పతీగ అనుమానాలపై ఆయుష్ క్లారిటీ…!

తిప్పతీగ అనుమానాలపై ఆయుష్ క్లారిటీ…!


ఈ కరోనా వచ్చాక ఆనందయ్య మందుతో విపరీతంగా ఫేమస్ అయింది తిప్పతీగ. ఈ తీగ ఎక్కువగా పల్లెల్లో కనిపిస్తుంది. అంతే కాదు అప్పుడప్పుడు పట్టణ శివార్లతో పాటు రోడ్ల పక్కన కూడా ఈ తీగను మనం చూడొచ్చు. అయితే ఈ తిప్పతీగకు మరోపేర్లు అమృత గుడూచి అని కూడా ఉన్నాయి. చాలా మందికి తెలియక ఈ తిప్పతీగను ఏదో పనికిరానిదిగా భావిస్తారు. కానీ తమలపాకు లాగా చాలా చిన్న రూపంలో ఉండే ఈ ఆకుతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి.

ఈ విషయాన్ని స్వయంగా ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతటి ఉపయోగాలున్న ఈ తిప్పతీగ గురించి తాజాగా ఓ జర్నల్ లో వచ్చిన అధ్యయనం ఇప్పడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందని చెప్పొచ్చు. ఈ తిప్పతీగను వాడితే కాలేయం దెబ్బ తింటుంది అంటూ ఆ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ హెపటాలజీలో ఓ అధ్యయనం రావడంతో పెద్ద ఎత్తున దీన్ని ఆధారంగా చేసుకుని ఇతర వార్తా పేపర్లలో కూడా వార్తులు ప్రచురించారు. ఇక ఈ నేపథ్యంలో దీనిపై ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు చాలా తీవ్రంగా స్పందించారు. తిప్పతీగపై వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమని తెలిపారు.

నిజానికి తిప్పతీగను వాడితే కాలేయానికి గానీ ఇతర అవయవాలకు గానీ ఎలాంటి సమస్యలు రావని ఆయుష్ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. తిప్పతీగ వాడి ముంబైలో ఆరుగురు రోగుల కాలేయాలు పాడైపోయాయంటూ ఇటీవల సోషల్ మీడియాలో కూడా రకరకాల కథనాలు వెల్లడయ్యాయి. వీటిపై కూడా స్పందించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు దాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించే లాగా ఉన్నాయని ఎవరూ నమ్మొద్దని తెలిపింది. అసలు నిజానికి తిప్పతీగ వల్ల కాలేయం దెబ్బతిన్నదని చెప్పడానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని కాబట్టి అలాంటి వార్తలు నిరాధారం అని తెలిపింది.

ఇక దాంతో పాటు తిప్పతీగ లాంటి ముఖ్యమైన మూలికలు కాలేయాన్ని సక్రమంగా పనిచేసేలా దోహదం చేస్తాయని వారు తెలిపారు. ఇందుకు గతంలో జరిగిన పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయని మంత్రిత్వశాఖ చెప్పింది. మరీ ముఖ్యంగా తిప్పతీగ మీద మాత్రమే ఇప్పటి వరకు 169కి పైగా పరిశోధనలు చేశామని ఎలాంటి చెడు ప్రభావాలు లేవని తెలిపింది. కాలేయం మంచిగా పనిచేసేలా చూసే లక్షణాలు తిప్పతీగకు ఉన్నాయని వివరించింది. కాబట్టి దీని వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు.