Templates by BIGtheme NET
Home >> GADGETS >> మైక్రోసాఫ్ట్ తాజా అలెర్ట్.. ఈ వార్తను చదవటం అస్సలు మిస్ చేయొద్దు

మైక్రోసాఫ్ట్ తాజా అలెర్ట్.. ఈ వార్తను చదవటం అస్సలు మిస్ చేయొద్దు


మిగిలిన రోజులకు మించి నడుస్తున్న కరోనా రోజుల్లో ఇప్పుడు అంతా సిస్టం.. ల్యాప్ టాప్ ను వినియోగిస్తున్నారు. ఆ మాటకు వస్తే.. ఆన్ లైన్ అన్నది అత్యవసర వస్తు సేవగా మారింది. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. జరిగే నష్టం అంతా ఇంతా కాదు. కరోనా మహమ్మారి మొదలై.. దాదాపు ఏడాదిన్నర కావటం.. వర్కు ఫ్రం హోం మరో ఏడాది పాటు సాగుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటివేళ.. ఇంట్లో ఉన్న కంప్యూటర్ కానీ ల్యాప్ టాప్ కానీ ఏ చిన్న తేడా వచ్చినా నష్టం తీవ్రంగా ఉంటుంది. దేశంలోని కంప్యూటర్లలో దాదాపు 90 శాతం వరకు మైక్రోసాఫ్ట్ ఓఎస్ నే వినియోగిస్తుంటారు. అలాంటి ఆ సంస్థ తాజాగా ఒక కీలక అప్డేట్ ను పోస్టు చేసింది.

విండోస్ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని కోరింది. ఆపరేటింగ్ సిస్టంలో తీవ్రమైన లోపం బయటపడిందని.. అందుకే ఒక అప్డేట్ ను వెంటనే ఇన్ స్టాల్ చేసుకోవాలని కోరింది. తాజాగా తాము గుర్తించిన లోపాన్ని ఉపయోగించుకొని హ్యాకర్లు డేటా చోరీకి తెగబడే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు.. తాము గుర్తించిన లోపాన్ని వివరించింది.

సాధారణంగా ఒకే ప్రింటర్ ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్ లో ‘ప్రింట్ స్పూలర్’ ను ఉపయోగిస్తారు. అందులో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లుగా మైక్రోసాఫ్ట్ తాజాగా గుర్తించింది. నిజానికి ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కు సాంగ్ ఫర్ అనే సైబర్ సెక్యురిటీ సంస్థకు చెందిన నిపుణులు గుర్తించి.. ఆ విషయాన్ని తెలియజేశారు. సాంగ్ ఫర్ అనే సంస్థ చేసిన తప్పేమిటంటే.. విండోస్ లోని లోపాన్ని ఎత్తి చూపటమే కాదు.. దాని కారణంగా కంప్యూటర్లను ఎలా హ్యాక్ చేయొచ్చన్న విషయాన్ని పొరపాటుగా ఆన్ లైన్ లో పబ్లిష్ చేశారు.

తాము చేసిన తప్పును గుర్తించిన వారు వెంటనే.. తమ పోస్టును డిలీట్ చేశారు. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ పోస్టులోని సమాచారం డెవలపర్ సైట్లలోకి కాపీ అయ్యింది. దీంతో.. మైక్రోసాఫ్ట్ అలెర్టు అయ్యింది. ప్రింట్ నైట్ మేర్ గా పిలుస్తున్న ఈ లోపాన్ని ఉపయోగించుకొని హ్యాకర్లు పలు ప్రోగ్రాంలను ఇతరుల కంప్యూటర్లలో ఇన్ స్టాల్ చేసే వీలుందని.. డేటాను చూడటం.. డిలీట్ చేయటంతో పాటు కొత్త యూజర్ అకౌంట్లను క్రియేట్ చేయటం లాంటి చర్యలకు పాల్పడే ఛాన్సు ఉందని పేర్కొంది.

అందుకే.. ఈ బగ్ ను క్లియర్ చేసేందుకు వీలైన అప్డేట్ ను మైక్రోసాఫ్ట్ తాజాగా విడుదల చేసింది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ.. వెంటనే విండోస్ వినియోగదారులంతా తమ తాజా అప్డేట్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని.. సిస్టంను సేవ్ చేసుకోవాలని కోరుతోంది. తాజా బగ్ తో హ్యాకర్లు ఇతరుల కంప్యూటర్లపై పూర్తి నియంత్రణ సాధించే వీలుందన్న హెచ్చరికను జారీ చేసింది. విండోస్ 7తో పాటు విండోస్ 10లోనూ ఈ లోపం ఉందని పేర్కొంది. ఇప్పటివరకు బయటపడ్డ లోపాల్ని అధిగమించేలా తాజా ఆప్డేట్ లో ప్రోగ్రాం చేసినట్లుగా చెప్పింది. ఈ నేపథ్యంలో.. ప్రతి ఒక్కరు తమ సిస్టంను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. అర్థమైంది కదా.. ఇప్పుడేం చేయాలో!