చిత్రం: అఖండ;
నటీనటులు: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు, అవినాష్, సాయికుమార్, శ్రవణ్, ప్రభాకర్, తదితరులు;
సంగీతం: తమన్;
ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్;
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు,
తమ్మిరాజు; కళ: ఎ.ఎస్.ప్రకాశ్;
మాటలు: ఎమ్.రత్నం;
పోరాటాలు: స్టంట్ శివ, రామ్, లక్ష్మణ్;
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి;
దర్శకత్వం: బోయపాటి శ్రీను;
సంస్థ: ద్వారక క్రియేషన్స్;
విడుదల: 2 డిసెంబర్ 2021
బాలకృష్ణ ఓ ఆటంబాంబ్ అన్నారు ఇటీవల అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఆయనకీ.. ఆయన నటనకీ ఉన్న శక్తి అలాంటిది. ఆయనతో దర్శకుడు బోయపాటి శ్రీను కలిశారంటే బాక్సాఫీసు దగ్గర రికార్డుల విధ్వంసమే. ఆ విషయం ఇదివరకే రుజువైంది. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత ఆ కలయికలో రూపొందిన చిత్రమే.. ‘అఖండ’. దీనికి కొబ్బరికాయ కొట్టడంతోనే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో మరింత ఉత్సుకతని రేకెత్తించాయి. మరి ‘అఖండ’ అవతారంలో బాలకృష్ణ గర్జన ఎలా ఉంది? బాలకృష్ణ – బోయపాటి కలయిక హ్యాట్రిక్ కొట్టినట్టేనా? తెలుసుకునే ముందు కథేమిటో తెలుసుకుందాం.
కథ: మురళీకృష్ణ (బాలకృష్ణ) ఫార్మరే కాదు, రీ ఫార్మర్ అని చెబుతుంటారు అనంతపురం ప్రజలు. ఫ్యాక్షనిజం బాట పట్టిన ఎంతోమందిని దారి మళ్లించి మార్పుకి శ్రీకారం చుడతాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆస్పత్రుల్ని కట్టించి ప్రజలకి సేవ చేస్తుంటాడు. అది చూసే ఆ జిల్లాకి కొత్తగా వచ్చిన కలెక్టర్ శరణ్య (ప్రగ్యాజైస్వాల్) మురళీకృష్ణపై మనసు పడుతుంది. ఆయన్ని మనువాడుతుంది. ఆ ప్రాంతంలో వరద రాజులు (శ్రీకాంత్) మైనింగ్ మాఫియాని నడుపుతుంటాడు. యురేనియం తవ్వకాలతో చిన్నారుల ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుంది. మైనింగ్ మాఫియా భరతం పట్టేందుకు రంగంలోకి దిగిన మురళీకృష్ణకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వరద రాజులు వెనక ఉన్న మాఫియా లీడర్ ఎవరు? చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయిన మురళీకృష్ణ తోడబుట్టిన శివుడు (బాలకృష్ణ) ఎక్కడ పెరిగాడు? ఊహ తెలియకముందే వారిద్దరూ విడిపోవడానికి కారణమేమిటి? మళ్లీ ఎలా కలిశారు? మురళీకృష్ణకి, కుటుంబానికి శివుడు ఎలా సాయం చేశాడన్నదే మిగతా కథ.
సమీక్ష: బాలకృష్ణ-బోయపాటి కలయిక నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో ఆ అంశాలన్నీ పక్కాగా కుదిరిన సినిమా ఇది. శివుడు అలియాస్ అఖండగానూ.. మురళీకృష్ణ పాత్రలోనూ బాలకృష్ణ తనదైన శైలిలో ఒదిగిపోయారు. అఖండ పాత్రలోనైతే ఆయన రౌద్ర ప్రదర్శన తీరు విశ్వరూపమే. ఇందులోని ఒక పాత్ర ప్రళయాన్ని గుర్తు చేస్తే, మరో పాత్ర ప్రకృతిలా అందంగా తెరపై కనిపిస్తుంది. కథానాయకుడి పరిచయ సన్నివేశాలు మొదలుకొని చివరి వరకు ప్రతీ సన్నివేశం కూడా బాలకృష్ణ మాస్ ఇమేజ్, బోయపాటి మార్క్ థీమ్ మేరకు సాగుతుంది. అభిమానులతో ఈలలు కొట్టించే ఎలివేషన్ సన్నివేశాలు అడుగడుగునా ఉంటాయి.
ప్రథమార్థం మురళీకృష్ణ – శరణ్యల మధ్య ప్రేమాయణం, పీఠాధీశుడిని చంపి శక్తి స్వరూపానంద స్వామిగా అవతరించి మైనింగ్ మాఫియాతో చేయించే ఆకృత్యాల నేపథ్యంలో సాగుతుంది. రైతుగా, ఆ ప్రాంత ప్రజల మేలుని కోరే వ్యక్తిగా మురళీకృష్ణ పాత్రలో బాలకృష్ణ ఆకట్టుకుంటారు. ప్రకృతి గురించి ఆయన చెప్పే సంభాషణలు అలరిస్తాయి. జై బాలయ్య పాట కిక్కెక్కిస్తే, అడిగా అడిగా.. పాటలో బాలకృష్ణ – ప్రగ్యా జోడీ చూడముచ్చటగా కనిపిస్తుంది. ఒకే పాటలోనే నాయకానాయికలకి పెళ్లి కావడం, పాప పుట్టడం, ఆ పాప ప్రోద్భలంతోనే రెండో పాత్ర అఖండని పరిచయం చేసిన తీరు బాగుంది.
ద్వితీయార్థానికి ముందు అఖండ పాత్ర ఆగమనం జరుగుతుంది. సినిమా అక్కడిదాకా ఒకెత్తు.. అఖండ పాత్ర ప్రవేశం తర్వాత మరో ఎత్తు. ప్రకృతి, చిన్నారులు, ముక్కంటి జోలికి వచ్చిన ప్రతినాయకుడిని అఖండ ఎలా అంతం చేశాడనేది ద్వితీయార్థంలో కీలకం. బాలకృష్ణ చేసిన రెండో పాత్రని అఘోరాగా చూపించడం సినిమాకి ప్లస్సయ్యింది. అఖండ శివుడి అంశతోనే పుట్టాడనే సంకేతాలు కనిపిస్తాయి కాబట్టి ఆ పాత్రలో బాలకృష్ణ ఎన్ని విన్యాసాలు చేసినా నమ్మేలా ఉంటాయి. ఆయన చెప్పే ప్రతీ సంభాషణ ఓ పోరాటంలా, ప్రతీ పోరాటం ఓ క్లైమాక్స్ సన్నివేశాన్ని తలపించేలా ఉంటుంది.
బాలకృష్ణని బోయపాటి శక్తిమంతంగా చూపిస్తారని తెలుసు.. కానీ ఇందులో డోస్ మరింత పెంచారు. ఇందులో కథ కంటే కూడా పాత్రల్ని మలిచిన తీరే ఆకట్టుకుంటుంది. దేవుడు, విజ్ఞానానికీ మధ్య సంబంధం గురించి, హిందుత్వం గురించీ, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని.. శివుడు మామూలు మనిషి కాదంటూ బాలకృష్ణ చెప్పే సంభాషణలు సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. చిన్నారులు, దేవాలయాలు, దేవుడు, ప్రకృతి తదితర అంశాల నేపథ్యంలో అక్కడక్కడా భావోద్వేగాలు పండాయి. మొత్తంగా మాస్ ప్రేక్షకుల్ని ఉత్సాహంగా థియేటర్లకి రప్పించే పక్కా పైసా వసూల్ చిత్రమిది.
ఎవరెలా చేశారంటే : బాలకృష్ణ వన్ మేన్ షోలా ఉంటుందీ చిత్రం. ఆయన సంభాషణలు విన్నాక.. ఆయన చేసే విన్యాసాలు చూశాక బాలకృష్ణ మాత్రమే చేయగల కథ ఇదనిపిస్తుంది. జై బాలయ్య పాటలో ఆడిపాడిన తీరు అభిమానుల్ని అలరిస్తే, ఆయన చేసిన పోరాటాలు మరో స్థాయిలో ఉంటాయి. బాలకృష్ణ రెండు పాత్రల్లో విజృంభించినప్పటికీ.. ఇందులోని మిగతా పాత్రలకి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. కథానాయిక ప్రగ్యా జైస్వాల్‌తోపాటు పూర్ణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా సినిమాలో కీలకమైనవే. ‘లెజెండ్’తో జగపతిబాబుని ప్రతినాయకుడిగా మార్చిన బోయపాటి శ్రీను.. ఈ సినిమాతో శ్రీకాంత్‌ని అలాంటి పాత్రలోనే చూపించారు. వరద రాజులుగా క్రూరమైన పాత్రలో ఆయన కనిపిస్తారు. బాలకృష్ణతో తొలిసారి ఎదురుపడే సన్నివేశం, అఘోరాతో తలపడే సన్నివేశాలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటాయి. జగపతిబాబు, కాలకేయ ప్రభాకర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. శక్తిస్వరూపానంద స్వామిగా కనిపించిన ప్రతినాయకుడు కూడా తనదైన ప్రభావం చూపించారు.
సాంకేతిక వర్గం పనితీరు : సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా తమన్ సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. అఘోరా నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో నేపథ్య సంగీతం కోసం ఆయన పడిన కష్టం ఎలాంటిదో అర్థమవుతుంది. జైబాలయ్య, అఖండ, అడిగా అడిగా.. పాటలు బాగున్నాయి. రామ్‌ప్రసాద్ కెమెరా పనితనం, ఎం.రత్నం మాటలు చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. రామ్‌లక్ష్మణ్, స్టంట్ శివ పోరాట ఘట్టాలు మెప్పిస్తాయి. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయిక ఎందుకు ప్రత్యేకమో ఈ సినిమా మరోసారి స్పష్టం చేస్తుంది. మాస్ నాడి తెలిసిన బోయపాటి తనదైన మార్క్‌ని ప్రదర్శిస్తూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే, భావోద్వేగాలు కూడా బలంగా పండేలా సినిమాని తీర్చిదిద్దారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
+బలాలు
+ బాలకృష్ణ నటన
+ పోరాట ఘట్టాలు
+ సంగీతం
+ భావోద్వేగాలు… ద్వితీయార్ధం
– బలహీనతలు
– కొన్ని పోరాట ఘట్టాలు సుదీర్ఘంగా సాగడం
చివరిగా: అఖండ… బాలకృష్ణ విజృంభణ అఖండం.
అఖండ రివ్యూ
కథ స్క్రీన్ ప్లే - 3.25
నటీ-నటుల ప్రతిభ - 4
సాంకేతిక వర్గం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.5
3.5
అఖండ రివ్యూ
అఖండ రివ్యూ
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

