మాయ‌ రివ్యూ

0

నీల‌కంఠ‌ది ప్ర‌త్యేక శైలి. సాధార‌ణ క‌థే ఎంచుకొంటాడు. కానీ… క‌థ‌నంతో ”మాయ‌” చేస్తాడు. ఎక్క‌డో ఓ చోట మెలిక పెడ‌తాడు. సినిమా మొత్తానికి ప్రాణం.. ఆ మెలికే. సినిమా హిట్ట‌యినా, ఫ్లాప‌యినా ఆ మెలికే కార‌ణం అవుతుంది. ఇప్పుడొచ్చిన‌ మాయ సినిమాలోనూ ఓ మెలిక ఉంది. అదే క‌థ‌కు కీల‌కం. మ‌రి అదెలా సాగింది..?? నీల‌కంఠ త‌ర‌హా మార్క్ ఈ సినిమాలో క‌నిపించిందా?? ఇంత‌కీ ఎవ‌ర్ని ”మాయ” చేయ‌డానికి ఈ ప్ర‌య‌త్నం…?? తెలుసుకొందాం.. రండి.

మేఘ‌న (అవంతిక‌) అనే ఓ అమ్మాయి క‌థ ఇది. ఆమెకు స‌డ‌న్‌గా భ‌విష్య‌త్తు క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుంటుంది. అదీ… చావులే! చిన్న‌ప్పుడు అమ్మ చనిపోయే సంగ‌తి ముందే తెలుస్తుంది. కానీ ఆమెను కాపాడుకోలేదు. మేఘ‌న పెరిగి పెద్ద‌ద‌వుతుంది. ఓ టీవీ ఛాన‌ల్‌లో ప‌నిచేస్తుంటుంది. ఇర‌వై ఏళ్ల త‌ర‌వాత‌… మ‌ళ్లీ భ‌విష్య‌త్తు క‌నిపించ‌డం మొద‌ల‌వుతుంది. ఎవ‌రో చ‌నిపోతున్న సంకేతాలు క‌నిపిస్తుంటాయి. అవి నిజం అవుతుంటాయి కూడా. ఇంత‌లో సిధ్దార్థ్ (రాణె) ప‌రిచ‌యం అవుతాడు. అత‌నో ఫ్యాష‌న్ డిజైన‌ర్‌. మన రాష్ట్రంలో అవ‌త‌రించిపోతున్న చేనేత ప‌రిశ్ర‌మ‌కు మ‌ళ్లీ ఆయువు పోయాల‌న్న ఆశ‌యంతో మేఘ‌న‌ని క‌లుస్తాడు. మేఘ‌న ప‌నిచేసే టీవీ ఛాన‌ల్‌తో క‌ల‌సి ఓ పోగ్రాం డిజైన్ చేస్తాడు. మేఘ‌న అంటే సిధ్దార్థ్ కి ఇష్టం ఏర్ప‌డుతుంది. సిధ్దార్థ్ ని కూడా మేఘ‌న ఇష్ట‌ప‌డుతుంది. అయితే… ర‌మ్య (సుష్మ‌) అనే మ‌రో పాత్ర క‌థ‌లోకి ప్ర‌వేశిస్తుంది. ర‌మ్య ఎవ‌రో కాదు.. మేఘ‌న చిన్న‌ప్ప‌టి స్నేహితురాలు. సిధ్దార్థ్ కి కాబోయే భార్య‌!! ఇక మేఘ‌న ఈ ల‌వ్ స్టోరీ నుంచి డ్రాప్ అవ్వాల‌నుకొంటుంది. కానీ మ‌ళ్లీ మేఘ‌న‌కు భ‌విష్య‌త్తు క‌నిపించ‌డం మొద‌ల‌వుతుంది. అందులో.. సిధ్దార్థ్ ర‌మ్య‌ని చంపేస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. క‌నీసం త‌న స్నేహితురాలినైనా కాపాడాల‌నుకొంటుంది మేఘ‌న‌. అందుకోసం ఏం చేసింది..? ఇంత‌కీ సిధ్దార్థ్ ఎలాంటి వాడు? అత‌ని ఫ్లాష్ బ్యాక్ ఏంటి?? ఈ సంగ‌తులు తెలుసుకోవాలంటే.. మీరూ ఈ మాయ‌లో ప‌డిపోవాల్సిందే.

హాలీవుడ్‌ లో ఫైన‌ల్ డెన్టినేష‌న్ అనే సినిమా వ‌చ్చింది. అయిదుపార్ట్‌లుగా. అందులోనూ.. భ‌విష్య‌త్తు క‌నిపిస్తుంటాయి. చావుల్ని ఎంత భ‌యంక‌రంగా చూపించారో, ఆ సిరీస్ విజ‌యాల‌కు కార‌ణం అదే. అదే పాయింట్ మాయ‌లోనూ తీసుకొన్నాడు నీల‌కంఠ‌. ఇంగ్లీష్ సినిమాలు చూసేవారికి మాయ పాయింట్ కొత్త‌గా ఉండ‌క‌పోవ‌చ్చు. చూడ‌నివాళ్ల‌కు మాయ‌లో అదే వెరైటీ అనిపిస్తుంది. దానికి త‌గ్గ‌ట్టు నీల‌కంఠ రెండు మూడు మెలిక‌ల్ని కొత్త‌గా రాసుకొన్నాడు. దానికి ఓ ప్రేమ క‌థ‌ని క‌లిపాడు. ఒక‌టేంటి.. రెండు మూడు ప్రేమ‌క‌థ‌లుంటాయి ఈ సినిమాలో. మొత్తానికి ఓ ల‌వ్ స్టోరీని థ్రిల్ల‌ర్ త‌ర‌హాలో చెప్పాడు. క‌థ ప్రారంభం సాఫీగా, ఆస‌క్తికరంగా సాగింది. అయితే… చేనేత ఎపిసోడ్, హీరోహీరోయిన్ల ప్రేమ వ్య‌వ‌హారం బోర్ కొట్టిస్తుంది. ఇలాంటి థ్రిల్ల‌ర్ త‌ర‌హా చిత్రాల్లో అన‌వ‌స‌ర‌మైన ఎపిసోడ్లు, సోదీ లేకుండా చూసుకోవాలి. అక్క‌డ నీల‌కంఠ భంగ‌ప‌డ్డాడు. కేవ‌లం నిడివి కోస‌మే ఆలోచించుకొని, పాట‌లు పెట్టి.. క‌థ‌ని లాగాడు. ఇంట్ర‌వెల్‌కి ముందిచ్చిన ట్విస్టుతో అస‌లు మాయ ప్రారంభం అవుతుంది. సెకండాఫ్‌లో మ‌ళ్లీ చివ‌రి 20 నిమిషాలు క‌థ‌కు ప్రాణం. నీల‌కంఠ మార్క్ అక్క‌డే క‌నిపించింది. ఈ క‌థ‌ని ముంగిచిన విధానం చూస్తే… నీల‌కంఠ ఈ స్ర్కిప్టుని ఎంత ప‌క‌డ్బందీగా రాసుకొన్నాడో అర్థ‌మ‌వుతుంది. ప్రేక్ష‌కుల‌కు ఓ క్లూ ఇచ్చి…. వాళ్ల‌ను వేరే దారిలో న‌డిపించి.. మాయ చేశాడు నీల‌కంఠ‌. అదేంటన్న‌ది ఇప్పుడే చెప్పేస్తే బాగోదు. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

రాణె అందంగా ఉన్నాడు. త‌న‌కు త‌గిన పాత్రే ఇది. జాన్ అబ్ర‌హాంలా ష‌ర్టు విప్పి కండ‌లు చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. అవంతిక అందంగా క‌నిపించింది. మౌనంగా ఉన్న‌ప్పుడు.. మ‌రింత బాగుంది. కొన్ని చోట్ల ఫేస్ ఫీలింగ్స్ ఇవ్వ‌డానికి ఇబ్బంది ప‌డ్డా, టోట‌ల్‌ గా ఓకే. సుష్మ పాత్ర పూర్తిగా మిస్ ఫైర్ అయ్యింది. ఆ పాత్ర‌లో మ‌రో క‌థానాయిక‌ని, అందం + న‌ట‌న తెలిసిన అమ్మాయిని తీసుకొంటే బాగుణ్ణు. నాగ‌బాబు ఓకే. మిగిలిన పాత్ర‌ల‌కు అంత సీన్ లేదు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్‌కి మంచి మార్కులు ప‌డ‌తాయి. ముఖ్యంగా నీల‌కంఠ మ‌రోసారి మంచి ఎఫెక్ట్ పెట్టి, రొటీన్ సినిమాల‌కు భిన్నంగా మాయ‌ని త‌యారు చేశాడు. నిడివిని త‌గ్గించుకొంటే… క‌థ‌నం మ‌రింత స్పీడ్‌గా ఉండేది. క్లైమాక్స్‌లో ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చి బోల్తా కొట్టించాడు. మాట‌లు సాధార‌ణంగా ఉన్నాయి. కెమెరా, నేప‌థ్య సంగీతం ఓకే. మ‌ధుర శ్రీ‌ధ‌ర్ ఈ సినిమాని నీట్‌గా, కథ‌కు త‌గిన బ‌డ్జెట్‌లో ప్లానింగ్‌తో తీసిన‌ట్టు అనిపిస్తోంది. శేఖ‌ర్ చంద్ర మ‌రీ ఓల్డ్ ట్యూన్స్ ఇచ్చాడు. ఆర్‌.ఆర్ మాత్రం ఆక‌ట్టుకొంటుంది.

మొత్తానికి రెండు మూడు ట్విస్టుల‌తో మాయ చేయాల‌ని చూశాడు నీల‌కంఠ‌. ఆ ట్విస్టులు చూడాల‌నుకొంటే సినిమా మొత్తాన్ని భ‌రించాల్సిందే. రొటీన్ సినిమాలు చూస్తూ మూస‌లో కొట్టుకు పోతున్న ప్రేక్ష‌కుల‌కు కాస్త రిలీఫ్ అయితే అందించాడు. ఆ విష‌యంలో మాత్రం మెచ్చుకోవాల్సిందే.