విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తోంది. విశాఖ ప్రైవేటీకరణ విషయం బయటకొచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. విశాఖ ఉక్కు ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా ఏకమవుతున్నారు. ఇప్పటికే విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా కూడా చేశారు. అయితే ప్రముఖ సినీ నటుడు, గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన శీవాజీ చేస్తున్న వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి.
నటుడు శివాజీ అంటే ఓ ఏడాది ముందు సంచలనం! ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ద్రవిడ’ ప్లాన్స్ చేస్తోందంటూ అప్పట్లో ప్రెస్మీట్ పెట్టి బోర్డుపై పాఠాలు చెప్పడం పెద్ద దుమారమే రేపింది. ఇక, ఏడాది క్రితమే ‘‘విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయబోతున్నారు.. పోక్సోకు కట్టబెట్టబోతున్నారు.. రాసిపెట్టుకోండి’’ అని శివాజీ అన్న మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
తాజాగా, విశాఖ ఉక్కుపై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి కాకరేపే విషయాలు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వీళ్ల మూల సూత్రం కాదని.. దయచేసి ప్రజలు అర్థం చేసుకోండంటూ మరో బాంబు పేల్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది జస్ట్ రూట్ మ్యాప్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టడానికి మూల సూత్రం.. గిరిజన ప్రాంతాల్లో ఉన్న బాక్సైట్‌ను తవ్వేసుకోవడానికే! విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం అనేది జస్ట్ రూట్ మ్యాప్ మాత్రమే. వాళ్లకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా చిన్నది.. బాక్సైట్‌ను దొబ్బెయడానికి వేస్తున్న స్కెచ్‌లే ఇవన్నీ! వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకంతో ఇది ఆగదు.’’ అని హీరో శివాజీ సంచలన విషయాలు చెప్పారు.
ఈ విషయాన్ని తాను ఊహించి చెబుతోంది కాదని మరో బాంబు పేల్చారు. బాక్సైట్ కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్న విషయం పూర్తిగా నిజమని, ఈ విషయం ఇంటర్నర్ సోర్స్ (అంతర్గత మిత్రుల) ద్వారా తెలిసిందని వ్యాఖ్యానించారు. ఇలా చెప్పే వారు ఎవరైనా కావొచ్చని, ఫైల్స్ మోసే ప్యూన్స్ ద్వారా కూడా ఈ నిజం బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు.
ఇక, ప్రధాని నరేంద్ర మోదీపై కూడా శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎందుకో ఆంధ్ర అనే పేరు గుజరాత్ ప్రధానికి నచ్చడం లేదు.. ఆంధ్రా బ్యాంక్‌ను తీసేశారు.. వేరే బ్యాంక్‌లో కలిపేశారు.. దేశం మొత్తం గుజరాత్ అయిపోతుంది. భారతదేశం ఏం లేదు.. గుజరాత్ దేశం కాబోతుంది. జాతిపిత నరేంద్ర మోదీ. ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర అనే పేరు ఎక్కడా కనిపించకూడదనేది వాళ్ల టార్గెట్.
ప్రత్యేక హోదా కోల్పోయాం.. అని వాళ్లు అనుకుంటున్నారు.. అది ఎప్పటికీ జరగదు. అది మా హక్కు.. ఆ హక్కుని చెరిపేయలేరు. అలాగే కడప స్టీల్ ఏ దశలో ఉందో తెలియదు. అమరావతి రైల్వే లైన్‌కి వెయ్యి రూపాయిలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ని ఇంత అవమానకరంగా అన్యాయం చేస్తుంటే భరిస్తూనే ఉన్నాం.’’ అంటూ శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
