కొడాలి నానికి గట్టి షాక్

0

ఏపీ పంచాయతీ రెండో విడత ఫలితాల్లోనూ వైసీపీ హవానే కనిపిస్తోంది. అయితే పలు చోట్ల టీడీపీ కూడా గట్టి పోటీనిస్తుండడం విశేషంగా మారింది. తాజాగా మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. ఆయన స్వగ్రామంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం మంత్రి కొడాలి నానికి శరాఘాతంగా మారింది.

గుడివాడ నియోజకవర్గంలోని పామర్రు మండలం యలమర్రు గ్రామం కొడాలి నాని స్వగ్రామం. ఇక్కడ సర్పంచ్ గా టీడీపీ అభ్యర్థి కొల్లూరి అనూష ఏకంగా 800 ఓట్లతో వైసీపీ అభ్యర్థిని మట్టికరిపించడం విశేషం. టీడీపీ నేతలను మంత్రి కొడాలి నాని బూతులు తిట్టడాన్ని ఆయన సొంత గ్రామం యలమర్రు వాసులు జీర్ణించుకోలేదని.. అందుకే కొడాలి నాని బలపరిచిన అభ్యర్థిని ఓడించారని స్థానిక టీడీపీ నేతలు అన్నారు.

గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో 20 పంచాయతీలకు గాను తొమ్మిది గ్రామాల్లో టీడీపీ మద్దతు అభ్యర్థులు విజయం సాధించారు. పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ స్వగ్రామంలోనూ టీడీపీ అభ్యర్థి గెలిచాడు. రామచంద్రాపురం నియోజకవర్గం హసన్ బాదలో వైసీపీ అభ్యర్తిపై టీడీపీ మద్దతుదారుడు నాగిరెడ్డి సతీష్ రావు 208 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ గా విజయం సాధించారు.