చీపుర్లు పట్టుకొని మరీ కొడాలి నానికి వార్నింగ్

0

రాజకీయ నేతలకు ఉండే సహజమైన లక్షణాల్ని మంత్రి కొడాలి నాని మిస్ అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. పార్టీ ఏదైనా.. ఇష్యూ మరేదైనా.. తమ ప్రాంతానికి అంతో ఇంతో ప్రయోజనం కలిగించే అంశాల మీద.. తొందరపడి వ్యాఖ్యలు చేయటానికి నేతలు ఇష్టపడరు. అందుకు భిన్నంగా అమరావతి అంశంపై కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు షాకింగ్ గా మారటమే కాదు.. తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. అదే సమయంలో ప్రజల్లో ఆయన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి.

ఇటీవల కాలంలో విపక్ష నేత.. ఒకప్పటి తన పొలిటికల్ బాస్ అయిన చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. రాజకీయాల్లో ఒకప్పటి గురువులు కాస్తా.. తర్వాతి కాలంలో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారో ఇటీవల కాలంలో చూస్తున్నదే. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఏపీ రాజధాని అమరావతిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి స్థానే.. మరో రెండు రాజధానులు తీసుకొచ్చి.. తమ ప్రాంతం ఊసురు తీస్తున్నారన్న వాదనను వినిపించటం తెలిసిందే.

ఇలాంటివేళలో.. అగ్నికి ఆజ్యం పోసేలా కొడాలి మాట్లాడారు. శాసన సభ రాజధానిగా కూడా అమరావతి అవసరం లేదని.. ఇదే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తన ప్రపోజల్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు పేర్కొనటంపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు.. కొడాలి తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

267 రోజులుగా సేవ్ అమరావతి పేరుతో నిరసన దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో భాగమైన పలు గ్రామాల రైతులు.. మహిళలు.. అమరావతిని కొనసాగించాలంటూ దీక్షలు చేస్తున్నారు. అలాంటి వారికి కొడాలి నాని మాటలు తీవ్రమైన కోపాన్ని తెప్పించాయి. తాజాగా వారు ఆందోళన చేపట్టారు. మహిళలు పలువురు చేతుల్లో చీపుర్లు పట్టుకొని.. మాట మీరితే దుమ్ము దులిపేస్తామంటూ మంత్రి కొడాలి నానికి హెచ్చరికలు జారీ చేశారు. అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని లేదంటే చీపురుతో దుమ్ము దులపటం ఖాయమని పేర్కొన్నారు. తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న కొడాలి నాని.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు కేంద్రం అవుతారో చూడాలి.