Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఈరోజు ఏపీతో పాటు ఏర్పడిన రాష్ట్రాలివే…ఏవి, ఎలా, ఎందుకు?

ఈరోజు ఏపీతో పాటు ఏర్పడిన రాష్ట్రాలివే…ఏవి, ఎలా, ఎందుకు?


ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఉద్యమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇందులో భాగంగా… 1953 నవంబర్ 1న తెలుగు మాట్లాడే 11 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే… నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ తోపాటు దేశంలో మరో ఆరు రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి.

అవును… 1953 నవంబర్ 1న తెలుగు మాట్లాడే 11 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ 11 జిల్లాలు నాడు మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. ఆ సమయంలో భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ బలంగా ఉండటంతో.. బలమైన ఉద్యమం జరిగింది. ఫలితంగా… ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దీనికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు పనిచేశారు. అనంతరం 1956 నవంబర్ 1న హైద్రాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది.

నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ మత్రమే కాదు.. హర్యానా, ఛత్తీస్ గఢ్, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కూడా రాష్ట్రావతరణ దినోత్సవాలు జరుపుకుంటాయి.

హర్యానా:
భారతదేశ ఉత్తర భాగంలో ఉన్న ఒక హర్యానా రాష్ట్రం కూడా భాషా ప్రాతిపదికన ఏర్పడింది. ఇందులో భాగంగా.. 1966 నవంబరు 1న పూర్వపు తూర్పు పంజాబ్ రాష్ట్రం నుండి వేరు చేయబడి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ప్రస్తుతం హర్యానాలో 22 జిల్లాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి… అభిరాయణ – అహిరాయణ – హిరాయణ – హర్యానా అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

ఛతీస్ గఢ్:
మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2000 ప్రకారం ఛతీస్ గఢ్ రాష్ట్రం నవంబర్ 1, 2000న ఏర్పడింది. నాడు కొత్త నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం ప్రత్యేక ఛత్తీస్‌ గఢ్ బిల్లును మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం కోసం పంపగా.. అక్కడ అది ఏకగ్రీవంగా ఆమోదించబడింది. దీంతో… నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ 25 ఆగస్టు 2000న మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి తన సమ్మతిని తెలియజేశారు.

దీంతో… నవంబర్ 1న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది! ఈ ప్రాంతంలో 36 పురాతన కోటల కారణంగా ఈ రాష్ట్రానికి ఆ పెరు వచ్చిందని చెబుతారు. ఛత్తీస్ అంటే ముప్పై ఆరు, గర్హ్ అంటే కోట! ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి.

కేరళ:
ఇదే క్రమంలో ఈ రోజు కేరళ రాష్ట్ర అవతరణదినోత్సవం కూడా. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన చాలా కాలం తర్వాత 1 నవంబర్ 1956న కేరళ రాష్ట్రం ఏర్పడింది! 1956కి ముందు కేరళ… దక్షిణ కెనరా, మలబార్. కొచ్చిన్, ట్రావెన్‌ కోర్ అనే నాలుగు ప్రాంతాలుగా ఉండేది! ఆ సమయంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ప్రకారం నవంబర్ 1న కేరళ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇందులో 14 జిల్లాలు ఉన్నాయి!

పంజాబ్:
ఇదే రోజు పంజాబ్ కూడా రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1947కు ముందు ఒకటిగా ఉండే పంజాబు.. స్వాతంత్ర్యం సందర్భంగా విభజనకు గురైంది. మహమ్మదీయులు ఎక్కువగా ఉన్న (పశ్చిమ) పంజాబు పాకిస్తాన్ లో భాగమవ్వగా.. సిక్కు, హిందూ మతస్తులు అధికంగా ఉన్న (తూర్పు) పంజాబు భారతదేశంలో ఉంది.

అనంతర కాలంలో 1966 నవంబరు 1న పంజాబులో హిందువులు ఎక్కువగా ఉన్న ఆగ్నేయప్రాంతాన్ని వేరుచేసి హర్యానా రాష్ట్రంగా ఏర్పరచారు. ఇదే రోజున పంజాబ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పంజాబ్ రాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నాయి. అయితే… జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే 5 నదులు పంజాబులో ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతానికి పంజాబు అనే పేరు వచ్చింది. పంజ్ అంటే ఐదు, ఆబ్ అంటే నీరు. ఈ రెండు పదాలనుండి ‘పంజాబు’ పదం వచ్చింది.

మధ్య ప్రదేశ్:
ఇదే రోజు మధ్య ప్రదేశ్ కూడా అవతరణ దినోత్సవం జరుపుకుంటుంది. సెంట్రల్ ప్రావిన్సులు, బేరార్, మధ్యభారత్, వింధ్యప్రదేశ్, భోపాల్ లు కలిసి 1 నవంబర్ 1956న మధ్యప్రదేశ్ ఏర్పడింది. ఈ సమయంలో భోపాల్‌ ను మధ్యప్రదేశ్ రాజధానిగా ఎంపిక చేశారు. 53 జిల్లాలతో రెండో అతిపెద్ద రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఉంది!

కర్ణాటక:
1956 నవంబర్ 1న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం కింద నైరుతి భారతదేశంలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను విలీనం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరిచారు. వాస్తవానికి ఈ రాష్ట్రాన్ని తొలుత మైసూర్ రాష్ట్రంగా పిలిచేవారు. అనంతరం 1973లో కర్ణాటకగా పేరు మార్చారు. కర్ణాటక అనే పేరు కన్నడ పదాలైన కరు, నాడు నుండి ఉద్భవించింది. కరు అంటే “ఎత్తైన” అనే అర్ధంతో “ఎత్తైన భూమి” అని, నాడు అంటే “నలుపు” అనే అర్ధంతో “నల్లని ప్రాంతం” (ప్రత్తి పంటకు అనువైన నల్లమట్టి ఉన్న ప్రాంతం) అనే అర్ధాలను సూచిస్తుంది. ఈ విధంగా నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ తో పాటు హర్యానా, ఛత్తీస్ గఢ్, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు
కూడా అవతరన దినోత్సవాలు జరుపుకుంటాయి.