Templates by BIGtheme NET
Home >> Telugu News >> కొత్త అధ్యక్షుడిగా అరవింద్ ?

కొత్త అధ్యక్షుడిగా అరవింద్ ?

తెలంగాణా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడిగా అరవింద్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించే విషయం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అరవింద్ చాలా సంవత్సరాలుగా తెలుగుదేశంపార్టీలో పనిచేస్తున్నారు. గతంలో అసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఎంతమంది ఎంఎల్ఏలు, మాజీ మంత్రులు, నేతలు టీడీపీని వదిలేసి బీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయినా అరవింద్ మాత్రం టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు.

మేనమామ దేవేందర్ గౌడ్ ద్వారా పార్టీలో చేరారు. దేవేందర్ పార్టీని వదిలేసి వెళ్ళిపోయినా అరవింద్ మాత్రం టీడీపీలోనే ఉండిపోయారు. తెలంగాణాలోని నేతల్లో చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతల్లో ఈయన కూడా ఒకరు. కాసానికి ముందే అరవింద్ కు పార్టీ పగ్గాలను అప్పగించాలని అనుకున్నా అనేక కారణాలను భేరీజు వేసిన చంద్రబాబు చివరకు ఈయన్ను పక్కనపెట్టారు. అయితే ఇపుడు కాసాని రాజీనామా చేయటంతో పార్టీ పగ్గాలు ఎవరికో ఒకరికి అప్పగించాల్సిన పరిస్ధితి వచ్చింది.

అందుకనే సుదీర్ఘంగా పార్టీలో ఉన్న, తనకు అత్యంత లాయల్ గా ఉన్న అరవింద్ కు ఇపుడు పగ్గాలు అప్పగించేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. మరో ఇద్దరు ముగ్గురి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నా అరవింద్ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. నగరానికే చెందిన అరవింద్ మొదటినుండి టీడీపీలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. గతంలో ఎన్నికల సమయాల్లో చాలాసార్లు అసెంబ్లి టికెట్ కోసం పరిశీలించటం తర్వాత ఏదో కారణంతో పక్కనపెట్టేయటం రివాజుగా మారింది. ఇంత జరిగినా అరవింద్ మాత్రం పార్టీని వదిలిపెట్టలేదు.

నిజానికి రాబోయే ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత ఉన్న కొందరు నేతలు, క్యాడర్ చాలా డీలా పడ్డారనే చెప్పాలి. కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసిన కారణం కూడా ఇదే. గడచిన ఏడాది కాలంగా కాసాని పార్టీలో పూర్తి యాక్టివ్ గా పనిచేసిన కారణం ఏమిటంటే తనతో పాటు తన కొడుకు కూడా అసెంబ్లీకి పోటీచేసి గెలవాలనే. మరిపుడు డీలాపడిన పార్టీని బలోపేతం చేయటానికే అరవింద్ పగ్గాలు అప్పగించబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Share via
Copy link