లాక్ డౌన్ వేళ.. బ్యాంకుల్లో ఏం జరిగిందో బయటకు వచ్చింది

0

Banks that have created a new record During Lockdown In India

Banks that have created a new record During Lockdown In India

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం తెలిసిందే. కంటికి కనిపించని వైరస్ ముప్పు పొంచి ఉన్న వేళ.. నగదు లావాదేవీల కంటే కూడా కార్డు ద్వారా చెల్లించేందుకే ప్రజలు మొగ్గు చూపిన వైనం తెలిసిందే. అయితే.. ఇదెంత ఎక్కువగా జరిగిందన్న విషయాన్ని కళ్లకు కట్టే గణాంకాలు తాజాగా బయటకు వచ్చాయి. అంతేకాదు.. లాక్ డౌన్ వేళ.. బ్యాంకులకు పెద్ద ఎత్తున వచ్చిన రిక్వెస్టుల వివరాలు వెల్లడయ్యాయి.

కరోనా భయంతో క్యాష్ కంటే కార్డుల్ని ప్రజలు భారీగా వినియోగించారు. కేవలం మూడు నెలల వ్యవధిలో బ్యాంకులు రికార్డు స్థాయిలో 1.6 కోట్ల డెబిట్ కార్డుల్ని జారీ చేయటం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. మార్చి నెలాఖరుకు ఉన్న 82.85 కోట్ల డెబిట్ కార్డులు.. జూన్ నెలాఖరుకు 84.54 కోట్లకు చేరిన వైనాన్ని ఆర్ బీఐ గణాంకాలు తాజాగా స్పష్టం చేస్తున్నాయి. కొత్త కార్డుల్ని జారీ చేయటంతో ప్రైవేటు బ్యాంకుల కంటే కూడా ప్రభుత్వ బ్యాంకులే ముందుండటం గమనార్హం.

లాక్ డౌన్ వేళ ప్రభుత్వ రంగ బ్యాంకులు జారీ చేసిన డెబిట్ కార్డుల సంఖ్య 58.56 కోట్ల నుంచి 59.71 కోట్లకు పెరిగితే.. ప్రైవేటు బ్యాంకులు మాత్రం కొత్తగా 40 లక్షల కార్డుల్ని మాత్రమే జారీ చేశాయి. మొత్తంగా చూసినా ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే.. ప్రభుత్వ బ్యాంకుల డెబిట్ కార్డులే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. బ్యాంకుల్లో డిజిటల్ లావీదేవీల సంఖ్య భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం లావాదేవీల్లో డిజిటల్ లావాదేవీల సంఖ్య 90 నుంచి 93 శాతానికి పెరిగాయి. అదే సమయంలో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ డిజిటల్ లావాదేవీలు 87 శాతం నుంచి 90 శాతానికి పెరిగాయి. మొత్తంగా లాక్ డౌన్ వెళ.. క్యాష్ కంటే కార్డుల్నే భారీగా వాడేసిన వైనం తాజా గణాంకాలు స్పష్టం చేశాయని చెప్పాలి.