Templates by BIGtheme NET
Home >> Telugu News >> కరోనా పుట్టింది భారత్ లోనే..చైనా సంచలన ఆరోపణ!

కరోనా పుట్టింది భారత్ లోనే..చైనా సంచలన ఆరోపణ!


కరోనా వైరస్ జోరు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రపంచంలో ప్రతి రోజు కూడా లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. వేలల్లో మరణాలు రికార్డు అవుతున్నాయి. ఇదిలా ఉంటే .. ఈ కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది అని అడిగితే అందరూ చెప్పే ఒకే ఒక మాట చైనా. ఎందుకంటే ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చింది చైనాలోనే ఆ చైనా కంట్రోల్ చేయలేకపోవడం అలాగే మహమ్మారి గురించి సరైన సమాచారాన్ని ఇతర దేశాలకి అందించలేకపోవడంతో వైరస్ వేగంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. అలాగే అమెరికా అధినేత ట్రంప్ అయితే కరోనా వైరస్ ను చైనా వైరస్ అని పిలిచేవారు.

అయితే చైనా మాత్రం కరోనా మహమ్మారి విషయంలో తన మీదన్న మరకను కప్పిపుచ్చుకనే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మహమ్మారి వైరస్ భారత్ లేదా బంగ్లాదేశ్లో పుట్టి ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు సంచలన ఆరోపణలు చేశారు. షాంఘై ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు రాసిన ఒక ఆర్టికల్ ప్రకారం గత ఏడాది డిసెంబర్ లో వుహాన్ లో వైరస్ వ్యాప్తికి ముందే భారత ఉపఖండంలో సదరు వైరస్ ఉనికిలో ఉందని అన్నారు. దీనితో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తల బృందం మాట్లాడుతూ కరోనా వైరస్ బహుశా 2019 వేసవిలో భారతదేశంలో ఉద్భవించిందని చెప్పుకొచ్చారు. జంతువుల నుంచి కలుషితమైన నీటి ద్వారా కరోనా వైరస్ మానవులలోకి ప్రవేశించిందని చైనా బృందం తెలిపింది. కరోనా వైరస్ యొక్క మూలాన్ని గుర్తించడానికి చైనా బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను చేస్తోంది.

విభిన్న ఉత్పరివర్తనాల ద్వారా వైరస్ యొక్క మూలాన్ని గుర్తించే ప్రయత్నంలో ఈ బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను చేసింది. అతి తక్కువ ఉత్పరివర్తనాలతో ఉన్న జాతి అసలుదని వారు వాదించారు. దీన్ని ప్రమాణంగా చూపుతూ పరిశోధకులు మొదటి కేసులు వుహాన్ లో నమోదవ్వలేదని వాదిస్తున్నారు. అందుకు బదులుగా భారతదేశం బంగ్లాదేశ్ వైపు వేలు చూపిస్తున్నారు. ఎందుకంటే తక్కువ మ్యుటేషన్లతో వైరస్ జాతులు ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చెందాయన్నది వారి వాదన. వైరస్ ఎక్కడ మొదలైందో ఆరోపించడానికి చైనా అధికారులు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో యుఎస్ ఇటలీలను మొదటి కరోనా కేసులు నమోదైనట్లు వ్యాఖ్యలు చేశారు.