Templates by BIGtheme NET
Home >> Telugu News >> హంగ్ వేళ.. మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుంది?

హంగ్ వేళ.. మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుంది?


గ్రేటర్ ఎన్నిక ఫలితం వచ్చింది. 150 డివిజన్లు ఉన్న హైదరాబాద్ మహానగరంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవటం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ కు 55 డివిజన్లు గెలిస్తే.. బీజేపీ 48 డివిజన్లను సొంతం చేసుకుంది. మజ్లిస్ కు గతంలో మాదిరే 44 డివిజన్లు వారి ఖాతాలో పడ్డాయి. గ్రేటర్ మేయర్ ను ఎంపిక చేసుకోవటంలో కీలకమైన ఎక్స్ అఫీషియ సభ్యులుగా 45 మంది ఉన్నారు. వీరిలో రాజ్యసభ.. లోక్ సభ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారు. వీరంతా కలిసి మేయర్.. డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవాలని జీహెచ్ఎంసీ చట్టం చెబుతోంది. అంటే.. 195 మంది ఉండే సభలో మేజిక్ ఫిగర్ 98 ఓట్ల మద్దతు ఉండాలి. వారు మాత్రమే మేయర్ ను నియమించటానికి అవకాశం ఉంది.

ఇప్పుడు వచ్చిన ఫలితాలు.. ఆయా పార్టీలకు ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యుల్ని చూసినా.. ఏ పార్టీ కూడా మేయర్ ను ఎంపిక చేసుకునేంత బలం ఎవరికి వారిగా లేదు. అదే సమయంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్-మజ్లిస్ లు కలిసి మేయర్ ను ఎంపిక చేసుకునే అవకాశం లేదు. అదే సమయంలో బీజేపీ.. మజ్లిస్ పార్టీలు రెండు కలిసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మేయర్ ఎంపిక ఎలా జరుగుతుంది? నిబంధనలు ఏం చెబుతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

మేయర్.. డిప్యూటీ మేయర్ ఎంపికకు రూల్ పొజిషన్ ఎలా ఉందంటే..

మేయర్ ఎన్నికకు కార్పొరేటర్లు.. ఎక్స్ అఫీషియో సభ్యులకు ఆహ్వానాన్ని పంపుతారు. వాటిని తీసుకొని వారు రావాల్సి ఉంటుంది. ఈ ఆహ్వానం ఎన్నిక జరగటానికి మూడు రోజుల ముందు వస్తుంది. తొలుత ఎన్నికైన కార్పొరేటర్ల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు. ప్రమాణ స్వీకారాన్ని తెలుగు.. హిందీ.. ఇంగ్లిషు.. ఉర్దుల్లో చేయిస్తారు.

మేయర్ అభ్యర్థిత్వానికి సంబంధించి ఒకరు పేరును ప్రతిపాదించాలి.మరొకరు బలపర్చాలని. అనతరం చేయి పైకెత్తటం ద్వారా ఓటింగ్ ఉంటుంది. ఎవరికి అనుకూలంగా ఎంతమంది చేతులు ఎత్తారో లెక్కిస్తారు. పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికే మేయర్ పదవి లభిస్తుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఏ పార్టీకి బలం లేనప్పుడు మెజార్టీని ఎలా లెక్కిస్తారు. దానికున్న నిబంధన ఏమిటంటే.. మొత్తం సభ్యుల్లో 50 శాతం కనీసం సభకు హాజరు కావాల్సి ఉంటుంది. దాన్నే ‘‘కోరం’’ అని వ్యవహరిస్తారు. కోరం లేని పక్షంలో.. అంటే.. సభకు హాజరు కావాల్సిన వారిలో యాభై శాతం మంది కూడా రాకపోతే.. తర్వాతి రోజుకు వాయిదా వేస్తారు. తర్వాతి రోజు కూడా కోరం లేకపోతే ఎన్నిక సంఘానికి సమాచారాన్ని అందిస్తారు. అక్కడి నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా కోరం లేనప్పటికి ఎన్నికను నిర్వహిస్తారు.

గ్రేటర్ లో ఎక్స్ అఫీషియోలుగా పేర్లు నమోదు చేసుకున్న ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు మేయర్ ఎన్నికల ఓటుహక్కు ఉంటుంది. అయితే.. వీరు తాము అంతకు ముందు మరే పురపాలిక సంఘం ఎన్నికల్లో ఎటు వేయలేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఓటు వేయటానికి అర్హత సాధిస్తారు. కార్పొరేటర్లుగా ఎన్నికైన వారే మేయర్ గా పోటీచేయటానికి అర్హులు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తాయి. దానికి తగ్గట్లే వారు ఓట్లు వేయాల్సి ఉంటుంది.