Templates by BIGtheme NET
Home >> Telugu News >> 400 ఏళ్ల తర్వాత వచ్చిన ఆకాశ అద్భుతం.. ఈ రోజే మిస్ కావొద్దు

400 ఏళ్ల తర్వాత వచ్చిన ఆకాశ అద్భుతం.. ఈ రోజే మిస్ కావొద్దు


అనంత విశ్వంలో అద్భుతాలెన్నో. వాటిని గుర్తించే సామర్థ్యం మనిషికి చాలా తక్కువ. ఒకవేళ గుర్తించినా.. వాటిని సామాన్యుడు నేరుగా చూసే అవకాశాలు ఎప్పుడో కానీ రావు. తాజాగా అలాంటి అరుదైన ఆకాశ అద్భుతం ఈ రోజు చోటు చేసుకోనుంది. ఈ రోజు (సోమవారం) రాత్రి ఆకాశంలో గురువు.. శని అత్యంత దగ్గరగా కనిపిస్తాయి. నేరుగా ఆకాశంలోకి చూసినప్పుడు రెండు భారీ గ్రహాలు అత్యంత దగ్గరగా వచ్చినట్లుగా కనిపిస్తాయి. భూమి నుంచి చూస్తున్నప్పుడు వీటి మధ్య దూరం 0.1 డిగ్రీల మేర మాత్రము ఉంటుంది.

ఇలాంటి అద్భుతం 1623లో చోటు చేసుకుంది. అలాంటిది మళ్లీ ఇన్నాళ్లకు.. ఇవాళ చోటు చేసుకుంటుంది.మరో ఆసక్తికరమైన అంశం.. ఈ రెండు గ్రహాలు దగ్గరగా వచ్చే వైనం రాత్రివేళ చోటు చేసుకోవటం గడిచిన 800 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ కారణంగా.. ఆకాశంలోకి నేరుగా చూసే అవకాశం కలగనుంది. మళ్లీ ఇలాంటి అరుదైన ఖగోళ వింత 2080 మార్చి 15న చోటు చేసుకోనుంది.

రెండు గ్రహాల మధ్య దూరం మామూలు కన్నా తగ్గి.. దగ్గరగా రావటానని సంయోగం అంటారు. ఈ దూరం మరింత తగ్గినప్పుడు దాన్ని మహా సంయోగంగా శాస్త్రవేత్తలు చెబుతారు. సౌర కుటుంబంలోనే అతి పెద్దది గురు గ్రహం. ఇది సూర్యుని నుంచి ఐదోది. స్యూరుడి చుట్టూ తిరగటానికి గురువుకు 12 ఏళ్లు పడుతుంది. గురువు తర్వాత రెండో పెద్ద గ్రహం శని. ఇది సూర్యుడి చుట్టూ తిరగటానికి 30 ఏళ్లు పడుతుంది. ఈ రెండు గ్రహాలు సూర్యుడి చుట్టు తిరిగే క్రమంలో ప్రతి 20 ఏళ్లకు ఒకసారి ఈ రెండు గ్రహాలు దగ్గరకు వచ్చినట్లుగా కనిపిస్తాయి.

కాకుంటే.. మరింత దగ్గరగా.. ఒకే వరుసలో ఉన్నట్లు కనిపించటం మాత్రం చాలా అరుదు. ఇది సోమవారం కనిపించనుంది. అత్యంత సమీపంగా ఈ రెండు గ్రహాలు వచ్చినట్లు కనిపించినా.. వాటి మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉండనుంది. ఈ సమయంలో భూమికి 89 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి గురు గ్రహం ఉండనుంది. మరి.. ఈ ఖగోళ అద్భుతాన్ని కళ్లారా చూడండి. అస్సలు మిస్ కావొద్దు.