10 వేల కోట్ల డ్రగ్స్ దందాలో చిట్టి ఎలకలేనా దొరికేది?

0

మాదకద్రవ్యాల వినియోగం.. సరఫరా తదితర కేసుల్లో ఇటీవల నార్కోటిక్స్ బృందాలు పలువురు సెలబ్రిటీల్ని అరెస్టులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ ముగ్గురు ప్రముఖ కథానాయికలు కూడా ఉన్నారు. రియా చక్రవర్తి.. రాగిణి ద్వివేది.. సంజన గల్రానీ వంటి నాయికలను ఈ కేసుల్లో ఇరికించారు. అయితే వీళ్లంతా కేవలం కొన్ని గ్రాములు గంజాయితో దొరికిపోయిన బాపతే కానీ.. పెద్ద రేంజులో ఎల్.ఎస్.డి.. కొకైన్ వంటి ప్రమాదకర మాదక ద్రవ్యాల్ని అమ్ముతున్న లేదా కొంటున్న దాఖలాలేవీ కనిపించలేదని చెబుతున్నారు.

మరి అధికారులకు వీళ్లు మాత్రమే కనిపిస్తారా? ప్రతిదానికి సినిమావాళ్లే ఎందుకని సాఫ్ట్ కార్నర్ అవుతున్నారు? అన్నదానిపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల పరంపర కురుస్తోంది. అసలు వీళ్లంతా ఎరలు మాత్రమే. పెద్ద చేపలు సొర చేపలు చాలానే ఉన్నాయి. అవన్నీ రాజకీయ రంగం లేదా పారిశ్రామిక రంగం లేదా రియల్ ఎస్టేట్.. ఇతరత్రా పెద్ద రేంజు కార్పొరెట్ గేమ్ లో భాగం అన్నది ప్రపంచానికి స్పష్ఠంగా తెలుసు. అయితే సినిమావాళ్లు అనగానే మీడియాకి లేదా సామాన్య జనాలకు కూడా ఆసక్తి. అందుకే నార్కో వాళ్లు అటువైపు ప్రధానంగా దృష్టి సారించి తామేదో ఉద్ధరించేసినట్టు అరెస్టులు కూడా చేస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒక సెక్షన్ నుంచి.

అకస్మాత్తుగా ఉరుమెల్లి మెరుపుపై పడిన చందంగా ఇలా హీరోయిన్లను అరెస్టులు చేసేస్తే డ్రగ్స్ కంట్రోల్ అయిపోయినట్టేనా? ఐటీ.. రియల్ ఎస్టేట్.. బిజినెస్ రంగాల్లోని డ్రగ్ డాన్లను పట్టుకోకుండా ఇవేం నాటకాలు? వాళ్లయితే ఏదోలా మ్యానేజ్ చేసి వెనక నుంచి ప్యాకేజీలు అందజేసి ఎస్కేప్ అయిపోతారా? ఏదో చిల్లరగా దొరికిపోయిన హీరోయిన్లను మాత్రం మీడియా ముందు హైలైట్ చేస్తారా? అంటూ రకరకాల కోణాల్లో నెటిజనం తాట తీస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కేజీల కొద్దీ గంజాయి సరఫరా చేసినా ఫర్వాలేదు కానీ సినిమావాళ్లు గ్రాముల్లో కొనుక్కున్నా లోనేస్తారా? అని నిలదీస్తున్నారు ఒక సెక్షన్ జనం.

సుశాంత్ బలవన్మరణం కేసులో ఇరుక్కున్న రియా సంగతి అటుంచితే.. ఇతర నాయికల విషయంలో కొంతవరకూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మాదకద్రవ్యాల వినియోగం సేకరణ లేదా అమ్మకం గురించి ప్రశ్నలు లేదా విచారణ ఎదుర్కొన్న ఎవరైనా ఒక వ్యాపారవేత్త లేదా ఒక ప్రముఖ మహిళా రాజకీయ నాయకుడిని చూశారా? అంటే సందేహమే. యేటేటా పదివేల కోట్ల మేర మాదక ద్రవ్యాల వ్యాపారం సాగుతుంటే సినిమావాళ్లు కేవలం 2 కోట్ల మేర బిజినెస్ లో మాత్రమే భాగం అని ఒక విశ్లేషకుడు చెప్పడం షాకిస్తోంది. మరి మిగతా డ్రగ్స్ అంతా ఎటువైపు వెళుతున్నట్టు? అంటే.. దీనివెనక అతిపెద్ద గూడుపుటానీ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొరచేపల్ని వదిలేసి చిట్టి ఎలకల్ని పట్టుకోవడమే అధికారులకు అలవాటు వ్యాపకంగా మారిందన్న కామెడీలు చేసేవాళ్లున్నారు.