Templates by BIGtheme NET
Home >> Telugu News >> టర్కీలో భారీ భూకంపం .. భారీ ఆస్తి నష్టం 14 మంది మృతి !

టర్కీలో భారీ భూకంపం .. భారీ ఆస్తి నష్టం 14 మంది మృతి !


టర్కీ గ్రీస్ బల్గేరియా దేశాలలో భారీ భూకంపం కుదిపేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు అయింది అని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ( USGS ) తెలిపింది. యూఎస్ జీఎస్ ప్రకారం సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందట. ఏజియన్ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా సునామీ కూడా సంభవించింది. దీనితో భారీగా ఆస్తి నష్టం జరిగింది. టర్కీలో భూకంపంధాటికి ఇప్పటివరకూ 14 మంది మృతిచెందారు. అలాగే మరో 450 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానిక మీడియా వెల్లడించింది.

ప్రధానంగా టర్కీలోని నాలుగో పెద్ద నగరమైన ఇజ్మిర్ను భూకంపం వణికించింది. 45 లక్షల మంది ఈ నగరంలో నివాసముంటున్నారు. భూప్రకంపనలతో జనం వీధుల్లోకి పరుగులు పెట్టారు. భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. సుమారు ఆరు భవనాలు నేల మట్టమయ్యాయి. సెంట్రల్ ఇజ్మీర్ లోని 20 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఒక్క బేరాక్లి జిల్లాలోనే 10 భవంతులు నేల మట్టమయ్యాయి. టర్కీలోని ఏజియన్ సముద్రంలో భారీ భూకంపానికి అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. సునామీ భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఇజ్మిర్ సమీపంలో చిన్నపాటి సునామీ రావడంతో సముద్రపు నీరు వీధుల్లోకి వచ్చింది. పలు వాహనాలు నీళ్లలో కొట్టుకుపోయాయి.

మరోవైపు టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో నూ భూ ప్రకంపనాలు సంభవించాయి. ప్రజలు ఇంటిని వదిలిపెట్టి రోడ్లపైకి వచ్చి నిలబడ్డారు. చాలాసేపు భయంతో వణికిపోయారు. ఏం జరుగుతోందనని ఆందోళన చెందారు. ఐతే అక్కడ ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని ఇస్తాంబుల్ గవర్నర్ తెలిపారు. . ఇక గ్రీస్ రాజధాని ఏథెన్స్ లోనూ భూప్రకంపనలు వచ్చాయి. గ్రీస్ కు చెందిన ద్వీపం సామోస్ లోనూ భూకంపం రావడంతో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అటు బల్గేరియాలోనూ భూ ప్రకంపనాలు సంభవించాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణనష్టం లేదని స్థానిక మీడియా వెల్లడించింది.