Templates by BIGtheme NET
Home >> Telugu News >> పెట్రోల్, డీజిల్ ధర తగ్గించని ఏపీ సర్కారు? కేంద్ర సూచనలు బేఖాతరు

పెట్రోల్, డీజిల్ ధర తగ్గించని ఏపీ సర్కారు? కేంద్ర సూచనలు బేఖాతరు


పెట్రోల్, డీజిల్ ధరలపై విపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన గలాట ఆంతా ఇంతా కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో చంద్రబాబు సర్కారు పెట్రోల్, డీజిల్ పై పన్ను పెంచిందని.. దాని ఫలితంగానే ధరలు భగ్గుమంటున్నాయని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ధరలను గుర్తుచేస్తూ టీడీపీ సర్కారును తూలనాడారు. ప్రజల్లో కూడా మంచి మార్కులు కొట్టేశారు. సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తరువాత మడత పేచీ పెట్టారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధర తగ్గే అవకాశం వచ్చినా సరైన రీతిలో స్పందించడం లేదు. శనివారం పెట్రోల్, డీజిల్ పై కేంద్రం సుంకాన్ని తగ్గించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు పన్ను తగ్గించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు, సూచనలిచ్చారు. కానీ జగన్ సర్కారు పట్టించుకోవడం లేదు. మిగతా రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన వెసులబాటును వినియోగించుకొని ప్రజలపై పెట్రోల్, డీజిల్ భారాన్ని తగ్గించాయి. ఏపీలో మాత్రం అందుకు పరిస్థితి విరుద్ధంగా ఉంది. అప్పుల కోసం పదే పదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసే జగన్‌ ప్రభుత్వం… పన్నులు తగ్గించుకోవాలని కేంద్రం చేసే సూచనలను మాత్రం ఖాతరు చేయడం లేదు. కరోనా లాక్‌డౌన్‌ కాలం నుంచి పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తగ్గించుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం అనేకసార్లు కోరినా వైసీపీ ప్రభుత్వం లెక్క చేయలేదు. మీరే పెంచారు.. మీరే తగ్గించుకోండి అన్నట్టు మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. మాకు వచ్చే ఆదాయాన్ని ఎందుకు వదులుకోవాలి. మాకు అవసరమైనవి మాత్రమే అడుగుతాం. మీరు చెప్పేవి మాత్రం మాకు వినిపించవు అనే తీరును కేంద్రానికి స్పష్టం చేస్తోంది.

మిగతా రాష్ట్రాలతో పోల్చితే..

విపరీతంగా పెరిగిన పెట్రో ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు గతేడాది చివర్లో 20కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సొంత పన్నులు తగ్గించుకున్నాయి. కేంద్రంతో సఖ్యత లేని కేరళ, రాజస్థాన్‌ ప్రభుత్వాలు సైతం ప్రజలకు కొంత భారం తగ్గించాయి. అయినా ఏపీ మాత్రం ఎవరెంత తగ్గించినా, తాము తగ్గేదేలే అన్నట్టు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దేశంలోనే టాప్‌లో నిలిపింది. ఇదే విషయాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికీ కొన్ని రాష్ర్టాలు సొంత పన్నులు అస్సలు తగ్గించలేదని స్పష్టంగా చెప్పారు. ఇటీవల కొవిడ్‌పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ కూడా ఏపీలో పెట్రో ధరలు అత్యధికంగా ఉన్నాయని చెప్పినా జగన్‌ సర్కారు తీరు మార్చుకోవడం లేదు. అనేక రాష్ట్రాలు అక్కడి ప్రజల విన్నపం మేరకు పెట్రో ధరల భారం నుంచి ఉపశమనం కలిగించాయి. ఏపీ తరహా రాష్ట్రాల్లో మాత్రం ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. తెలుగుదేశం హయాంలో పెట్రో ధరల్లో దేశంలోనే నాలుగైదు స్థానాల్లో ఏపీ ఉండేది. కానీ జగన్‌ ప్రభుత్వంలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాలు పన్నులు తగ్గించుకుని వెనక్కి తగ్గితే, కొత్త పన్నులు వేయకుండా మిగిలిన రాష్ట్రాలు యథాతథ స్థితిని కొనసాగిస్తున్నాయి.

ధరల్లో ఏపీ టాప్

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఎడాపెడా పన్నులు పెంచి దేశంలోనే ఏపీని టాప్‌లో నిలిపింది. అదనపు వ్యాట్‌ రూ.2, రోడ్ల అభివృద్ధి పన్ను రూపాయి జగన్‌ ప్రభుత్వంలో కొత్తగా పుట్టుకొచ్చాయి. ఎప్పటిలాగే పెట్రోల్‌పై 31శాతం, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్‌ విధిస్తోంది. ఈ పన్నుల బాదుడు చూసి పక్క రాష్ట్రాల వాహనదారులు ఏపీలో ఇంధనం కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొల్పారు.పెట్రోల్‌, డీజిల్‌పై సొంత పన్నులు తగ్గించకపోగా, ఆ నెపాన్ని కూడా కేంద్రంపైకి నెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. పన్నులు ఎందుకు తగ్గించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ధరలు మేం పెంచామా తగ్గించడానికి అంటూ ఎదురుదాడి చేస్తోంది. కానీ, కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచిన ప్రతిసారీ ఏపీకి లాభం చేకూరుతోంది. నిన్నటి వరకూ పెట్రోల్‌పై కేంద్రానికి రూ.31 ఆదాయం వస్తే, రాష్ట్రానికి కూడా అంతే వచ్చింది. డీజిల్‌పైనా రూ.25 వచ్చింది. ఇప్పుడు పెట్రోల్‌పై కేంద్రం రూ.8 పన్ను తగ్గిస్తే, ఏపీలో మొత్తం రూ.10.57 తగ్గింది. అంటే కేంద్ర పన్నుతో పాటు ఏపీ వ్యాట్‌ రూ.2.57 తగ్గింది. డీజిల్‌పై కేంద్రం రూ.6 తగ్గిస్తే ఏపీలో ధర రూ.7.36 తగ్గింది. అంటే ఏపీ పన్ను రూ.1.36 తగ్గింది. దీని ప్రకారం పెట్రో ధరలు భారీ స్థాయికి చేరకముందు ఏపీలో సొంత పన్నులు తక్కువగా ఉండేవి. కేంద్రం ధరలు పెంచడంతో క్రమంగా ఏపీ ఆదాయమూ పెరిగిపోయింది. ఇది బయటకు చెప్పకుండా ఎంతసేపూ ధరలతో మాకు సంబంధం లేదంటూ జగన్‌ సర్కారు ప్రజల్ని మభ్యపెట్టే యత్నం చేస్తోంది.