Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఘనంగా రథసప్తమి వేడుకలు

ఘనంగా రథసప్తమి వేడుకలు


జమలాపురం వేంకటేశ్వ రస్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాపరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ జిల్లా మీడియా ప్రతినిధుల బృందంతో పాల్గొన్నారు. ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో విశేషంగా సూర్యారాధన నిర్వహించారు. పొంగళ్లతో సూర్యుడికి నైవేద్యం సమర్పించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉన్న శ్రీవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించి కళ్యాణవేదిక వద్దకు చేర్చి పట్టు వస్ర్తాలు సమర్పించి నిత్య కళ్యాణం నిర్వహించారు. అనంతరం సాయంకాలం సమయంలో శ్రీవారిని సూర్యప్రభ వాహనంపై మూడవీధుల్లో ఊరేగింపుగా గిరిప్రదక్షిణ చేయించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీని వాసశర్మ, ఈవో కె.జగన్‌మోహన్‌రావు, ఎస్‌ఐ సురేష్‌, సర్పంచ్‌ మల్పూరి స్వప్న, ఎర్రుపాలెం ఫ్యాక్స్‌ చైర్మన్‌ మల్పూరి శ్రీనివాసరావు, చావా రామకృష్ణ పాల్గొన్నారు.

సత్తుపల్లి మండలంలోని రేజర్లలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రవచనకర్త శ్రీమాన్‌ నల్లాన్‌ చక్రవర్తుల రామకృష్ణమాచార్య స్వామి ఆధ్వర్యంలో ఉదయం ఆరాధనలు, సేవాకాలం అనంతరం భక్తులందరూ సూర్య నమస్కారాలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆవు పిడకల పొయ్యిపై పాయసాన్ని వండి స్వామివార్లకు నివేదన చేశారు.

లోకకళ్యాణం కోసం రథసప్తమి పర్వదినాన సందర్భంగా నాచారం దేవాలయానికి భక్తులు కాలినడకన వెళ్లిపూజలు చేశారు. శనివారం ఏన్కూరు శివాలయ కమిటీ ఆద్వర్యంలో సుమారు 50 మంది భఖ్తులు శివాలయం నుంచి నాచారం వేంకటేశ్వరస్వామి దేవాలయం వరకు 7కి.మీ. కాలినడకన భగవన్మామ స్మరణ జపించు కుంటూ వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శివాలయ కమిటీ సభ్యులు గుమ్మడెల్లి నాగేశ్వరరావు, వేముల రమేష్‌బాబు, అమరనేని నరసింహా రావు, రాధా, చందులాల్‌నాయక్‌, కొండ సత్యనారాయణ, ప్రభావతి, శ్రీదేవి పాల్గొన్నారు.