Templates by BIGtheme NET
Home >> Telugu News >> రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు:కేటీఆర్

రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు:కేటీఆర్


టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల పై కాంగ్రెస్ నేత ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ను ఇరుకున పెట్టే ఏ ఒక్క అవకాశాన్నీ రేవంత్ వదులుకోరు. కేసీఆర్ మీద పొడుపు కథలు సామెతలు చెబుతూ వ్యంగ్యంగా విమర్శలు గుప్పిస్తుంటారు రేవంత్. అయితే టీఆర్ఎస్ సర్కార్ పై ఆ పార్టీ నేతలపై రేవంత్ అనేకసార్లు విమర్శలు చేసినా కేసీఆర్ కేటీఆర్ లు గట్టిగా స్పందించిన దాఖలాలు లేవు. రేవంత్ విమర్శలకు స్పందించి అనవసరంగా ప్రాధాన్యతను కల్పించడం ఎందుకన్నది గులాబీ బాస్ ఆంతర్యం. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారని రేపో మాపో బీజేపీలోకి పోతారని కేటీఆర్ చెప్పిన జోస్యం ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు తన దృష్టిలో అసలు రేవంత్రెడ్డి లీడరే కాదంటూ కేటీఆర్ కొట్టిపారేడం చర్చనీయాంశమైంది. దీంతోపాటు ప్రధాని మోడీపై కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సిద్దిపేటలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేటీఆర్….తమ ఓపిక నశిస్తే ప్రధాని మోడీ సహా ఎవరినీ వదిలిపెట్టబోమని షాకింగ్ కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డిని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. తమ పాలనలో బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటోందని కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కడుతున్నారని దుబ్బాకలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదని జోస్యం చెప్పారు. బీజేపీ నేతలను కిషన్ రెడ్డి అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు కేటీఆర్. తెలంగాణ రూ.27718 కోట్లను వ్యవసాయ రుణమాఫీ చేసిందని ఆర్బీఐ వెల్లడించిందని దివాళాకోరు ప్రతిపక్షాలు ఆర్బీఐ నివేదికను గుర్తించలేదని కేటీఆర్ చురకలంటించారు. రేవంత్ తో పాటు చాలామంది కాంగ్రస్ నేతలు బీజేపీకి క్యూకట్టబోతున్నారని పార్టీలు మారే నేతలను ప్రజలు పట్టించుకోరని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.