బోరిక్ జాన్సన్ రాజీనామా.. బ్రిటన్ కొత్త ప్రధాని భారతీయ వ్యక్తి.. ఎవరో తెలుసా?

0

అంతా అనుకున్నట్లే బ్రిటన్ లో బోరిస్ జాన్సన్ ప్రభుత్వ పాలన మున్నాళ్ల ముచ్చటైంది. వరుస వివాదాల్లో చిక్కుకున్న ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు ప్రధాని పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. బ్రిటన్ ప్రధాని పదవిని గురువారం బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. పార్టీ నేతల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ఇప్పుడు తదుపరి ప్రధాని ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో మొదట రాజీనామా చేసిన ప్రవాస భారతీయుడైన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ పేరు వినిపిస్తోంది. ఒకవేళ ఈయనే నియామకం అయితే మాత్రం బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సొంతం చేసుకుంటారు. భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అల్లుడే ఈ రిషి సునాక్ కావడం విశేషం.

-రిషి సునాక్ ఎవరు? ఎక్కడి వారు?
రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ లో జన్మించాడు. ఆయన పూర్వీకులది భారత్ లోని పంజాబ్. వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్ వీర్ కెన్యాలో.. తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్ వలస వెళ్లాక వివాహం చేసుకున్నారు. వీరికి సంతానంగా రిషి పుట్టాడు.

రిషి స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశాడు. తొలుత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశాడు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతతో పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన 2015లో రిచ్ మాండ్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి రిషి గెలిచాడు. 2019లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో రిషి బోరిస్ జాన్సన్ కు మద్దతునిచ్చాడు. బోరిస్ ప్రధానిగా ఎన్నికయ్యాక రిషికి కీలకమైన ఆర్థికశాఖలో చీఫ్ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించాడు.

బోరిస్ జాన్సన్ కు అత్యంత నమ్మకస్తుడిగా సునాక్ కు పేరుంది. ఆయన కేబినెట్ లో ‘రైజింగ్ స్టార్’ మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. దీంతో 2020 ఫిబ్రవరిలో ఇతడికి ఛాన్సలర్ గా పదోన్నతి కూడా దక్కింది. కేబినెట్ పూర్తిస్థాయి ఆర్థికమంత్రిగా ప్రమోట్ అయ్యాడు. తొలి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాడు. హిందువు అయిన సునాక్ పార్లమెంట్ లో భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. కరోనా సమయంలో రిషి ప్రవేశపెట్టిన పథకాలు వ్యాపారులు ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచి ఆర్థిక ప్రయోజనం కలిగించాయి. అందుకే ప్రజల్లో రిషికి మంచి ఆదరణ వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బ్రిటన్ ప్రధాని పదవి కోల్పోవడానికి బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెబుతున్నారు.ఇంతకీ ఈ సంక్షోభానికి కారణం వెతికితే.. పార్లమెంట్ సభ్యుడు క్రిస్ పించర్ గా చెప్పాలి. అతడ్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నెత్తిన పెట్టుకోవటం.. అతగాడి పని తీరుతో మొత్తం డిస్ట్రబ్ అవుతుందన్న ఆరోపణలున్నాయి. గతంలో ఆయన్ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్ పదవిలో కూర్చోబెడుతూ బోరీస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు.

ఒక క్లబ్ లో తాగిన మత్తులో క్రిస్ పించర్ ఇద్దరు మగాళ్ల విషయంలో తేడాగా వ్యవహరించటం.. దానిపై కంప్లైంట్లు రావటంతో తీవ్ర వివాదానికి కారణమైంది. దీంతో అతడ్ని పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. పించ్ ఇలాంటి వాడని తనకు ముందు తెలియదని బోరిస్ జాన్సన్ తప్పుకునే ప్రయత్నం చేశారు. దీనికి బదులుగా.. పించర్ గురించి తాము ముందే చెప్పినట్లుగా మాజీ అధికారి ఒకరు పేర్కొనటంతో బోరీస్ జాన్సన్ అడ్డంగా బుక్ అయ్యారు. ప్రధాని నోటి నుంచి అసత్యాల నేపథ్యంలో గురి చూసి కొట్టిన బాణంలా.. తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో బోరీస్ జాన్సన్ ప్రభుత్వానికి నూకలు చెల్లిన పరిస్థితి.

ఇటీవల కాలంలో బోరీస్ జాన్సన్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుందన్న విమర్శ ఉంది. ప్రజలు వేలెత్తే వరకు విషయాన్ని తీసుకెళ్లి.. తర్వాత క్షమాపణలు చెప్పటం ఒక అలవాటుగా మారిందంటున్నారు. తాజా ఎపిసోడ్ లోనూ తనకేమీ తెలీదన్న మాటను చెప్పి.. అనంతరం తప్పు జరిగిందని చెంపలేసుకున్న బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు ఉండటం గమనార్హం.