Templates by BIGtheme NET
Home >> Telugu News >> లిఫ్టు మెకానిక్ కు రూ.76.5లక్షల జీఎస్టీ బకాయి? ఆరా తీస్తే షాకింగ్ నిజం

లిఫ్టు మెకానిక్ కు రూ.76.5లక్షల జీఎస్టీ బకాయి? ఆరా తీస్తే షాకింగ్ నిజం


అతడో సాదాసీదా లిఫ్టు మెకానిక్. చాలీచాలని జీతంతో బతుకుబండి లాగిస్తుంటాడు. అలాంటి అతగాడికి తాజాగా ఐటీ శాఖ నుంచి తాఖీదు అందింది. దాని సారాంశం ‘మీరు ఇప్పటివరకు రూ.76.5లక్షల జీఎస్టీ బకాయిలు ఉన్నారు. వెంటనే కట్టండి’ అని. ఆ అంకెల్ని చూసి ఠారెత్తిపోయిన అతడు పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన పోలీసులు విచారణ జరపగా.. షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

సదరు లిఫ్టు మెకానిక్ పేరు మీద ఎవరో కంపెనీని ఏర్పాటు చేయటమే కాదు.. ఏకంగా రూ.4.25 కోట్ల లావాదేవీల్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన జీఎస్టీ బకాయి కట్టాలంటూ మొయిల్ పంపారు. జీఎస్టీ నుంచి తప్పించుకునేందుకు ఒక మోసగాడు వేసిన ప్లాన్ గా పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ కు చెందిన సంతోష్ లిఫ్టు మెకానిక్ గా పని చేస్తుంటాడు. గత జూన్ 26న ఆయనకు ఐటీశాఖ నుంచి ఒక మొయిల్ వచ్చింది. దాని సారాంశం.. మీ పేరున ఉన్న కేఎస్ స్టీల్స్ కంపెనీ ద్వారా కోట్లాది రూపాయిల అమ్మకాలుజరిపారు.. దానికి సంబంధించిన పన్ను మొత్తాన్ని కట్టాలని తేల్చారు.

దీంతో.. ఐటీ అధికారుల్ని సంప్రదించిన సంతోష్ కు షాకింగ్ విషయాలు తెలిసాయి. అతని పేరు మీద బేగంపేట అడ్రస్ లో కంపెనీ రిజిస్టర్ ఉందని చెప్పటంతో మరోసారి అవాక్కు అయ్యాడు. దీంతో మరింత లోతుకు వెళ్లి పరిశీలించగా.. తన పేరు మీద విద్యుత్ బిల్లుతో పాటు.. వ్యాపార లావాదేవీలకు తన పాన్ కార్డును వినియోగిస్తున్న వైనాన్ని గుర్తించారు. దీంతో.. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగారు. చివరకు డొంక కదిలింది. లిప్టు మెకానిక్ గా వ్యవహరించే సంతోష్.. కొత్త ఆర్డర్లు పొందేందుకు తన పాన్ కార్డును గతంలో వైజాగ్ కు చెందిన ఒక సంస్థకు ఇచ్చాడు. అదే సంస్థలో పని చేసే విజయ్ బాబు అనే వ్యక్తి ఈ కార్డును దొంగలించి.. అగర్వాల్ పేరుతో ఉన్న విద్యుత్ బిల్లును సంతోష్ పేరుతో మార్ఫింగ్ చేశాడు. తప్పడు అడ్రస్ లు రెఢీ చేసి.. బేగంపేటలో స్టీల్ కంపెనీ నడుస్తున్నట్లుగా మాయ కంపెనీని ఏర్పాటు చేశాడు. నకిలీ పత్రాలతో జీఎస్టీ నెంబరును పొందాడు. విజయబాబు తన సొంత కంపెనీ నుంచి సామాగ్రిని అమ్మినా.. పన్ను తప్పించుకునేందుకు ఈ నాటకమంతా ఆడాడు. ఐటీ శాఖ పంపిన నోటీసుల ఆధారంగా ఈ మొత్తం గుట్టురట్టైంది. విజయబాబును అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా అతన్ని రిమాండ్ కు పంపారు.