Templates by BIGtheme NET
Home >> Telugu News >> మోడీ సర్కార్ కు షాక్.. వ్యవసాయ చట్టాల అమలు ఆపాలన్న సుప్రీంకోర్టు

మోడీ సర్కార్ కు షాక్.. వ్యవసాయ చట్టాల అమలు ఆపాలన్న సుప్రీంకోర్టు


కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు దాఖలైన పిటీషన్లపై ఈరోజు విచారణ జరిగింది. ఈ చట్టాలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులు వ్యతిరేకిస్తున్న నూతన వ్యవసాయ చట్టాల అమలును ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రైతు సంఘాలు కోర్టుకు హాజరు కాకపోవడంతో వారికి ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేదు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ.. ‘వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయడానికి అవకాశాలను పరిశీలించాలని’ కేంద్రానికి సూచించారు.

అయితే వ్యవసాయ చట్టాల అమలును ఆపడం జరిగే పనికాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనికి చీఫ్ జస్టిస్ దయచేసి పరిశీలించాలని.. ఈలోగా రైతు సంఘాలకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. తదుపరి విచారణ వింటర్ వెకేషన్ లో జరుగుతుందని తెలిపారు. వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించేందుకు పిటీషనర్లకు అవకాశం కల్పించారు.

మూడు వారాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. కేంద్రం చర్చలు జరిపినా.. చట్టాలు సవరిస్తామన్నా రైతులు వెనక్కి తగ్గడం లేదు. చట్టాలు రద్దు చేస్తేనే ఆందోళన విరమిస్తామని అంటున్నారు. దీంతో ఈ పీటముడి సుప్రీంకోర్టులోనూ తెగడం లేదు.