Templates by BIGtheme NET
Home >> Telugu News >> తెలంగాణ డీజీపీపై ఈసీ వేటు.. స‌స్పెండ్ చేసిన ఎన్నిక‌ల సంఘం

తెలంగాణ డీజీపీపై ఈసీ వేటు.. స‌స్పెండ్ చేసిన ఎన్నిక‌ల సంఘం

తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్‌.. డీజీపీ .. అంజ‌నీకుమార్‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారని ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఆయ‌న‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ ఉత్త‌ర్వులు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. దీంతో తెలంగాణ పోలీసులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు.

ఏంటీ కార‌ణం?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్న నేప‌థ్యంలోనే డీజీపీ అంజ‌నీ కుమార్‌.. నేరుగా కాంగ్రెస్ పీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి క‌లుసుకున్నారు. ఆయ‌న శుభాకాంక్ష‌లు చెప్పారు. పుష్ప‌గుచ్ఛం అందించారు. నిజానికి అప్ప‌టికి ఇంకా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోనే ఉంది. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల మేర‌కు.. ఫ‌లితాలు పూర్తిగా వ‌చ్చాక‌.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వాటిని డిక్లేర్ చేసిన త‌ర్వాత‌.. ఎవ‌రు గెలిచారు? ఎవ‌రు ఓడారు అన్న‌ది ఎన్నికల సంఘం అధికారికంగా ప్ర‌క‌టించాక మాత్ర‌మే అధికారులు రాజ‌కీయ నేత‌ల‌ను క‌లుసుకోవాల్సి ఉంది.

అయితే.. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇంకా వెలువ‌డుతున్న స‌మ‌యంలోనే అంజ‌నీ కుమార్‌.. మ‌రో డీజీపీ(శాంతి భ‌ద్ర‌త‌లు)తో క‌లిసి.. రేవంత్ నివాసానికి వెళ్లి శుభాకాంక్ష‌లు తెలిపారు. అప్ప‌టికి.. కాంగ్రెస్ లీడ్లో ఉంది. దీంతో కాంగ్రెస్ గెలిచేస్తుంద‌న్న సంకేతాలు కూడా వ‌చ్చాయి.ఈక్ర‌మంలో అంద‌రిక‌న్నా ముందుగానే.. డీజీపీ వెళ్లి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇది అన్ని మాధ్య‌మాల్లోనూ వైర‌ల్ అయింది. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న ఎన్నిక‌ల సంఘం.. డీజీపీపై వేటు వేస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

Share via
Copy link