Templates by BIGtheme NET
Home >> Telugu News >> వైజాగ్ వాసులకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం !

వైజాగ్ వాసులకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం !


హైవేలు ..దేశ రవాణా వ్యవస్థల్లో అత్యంత కీలక పాత్ర వహిస్తాయి. కానీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మనదేశంలో హైవేలపై రవాణా అంత ఆశాజనకంగా సాగడంలేదు. రవాణా రంగానికి మరింత ఊతం ఇవ్వాలని అలాగే కీలక నగరాల మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేయడం కోసం నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నూతన హైవేల నిర్మాణానికి నడుం బిగించింది. 23 కొత్త హైవేల నిర్మాణానికి హైవేస్ అథారిటీ డెడ్ లైన్ విధించింది. 2025 మార్చి 25లోగా ఈ హైవేలను నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ-ముంబై అహ్మదాబాద్-ధోలెరా అమృత్ సర్-జామ్ నగర్ ఎక్స్ ప్రెస్ వేలు 2023 మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అలాగే మరో 9 హైవేలను 2024 మార్చిలోగా పూర్తి చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. మిగతా 9 గ్రీన్ ఫీల్డ్ హైవేలు మార్చి 2025 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ మొత్తం 23 హైవేల పొడవు 7800 కిలోమీటర్లు కాగా.. వీటి నిర్మాణానికి రూ.3.3 లక్షల కోట్లు అంచనా. ఈ హైవేలు హైదరాబాద్ వైజాగ్ విజయవాడల మీదుగా కూడా వెళ్లనున్నాయి. వీటి నిర్మాణం కోసం ఎన్ హెచ్ ఏ ఐ స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ను ఏర్పాటు చేయనుంది.

కొత్త హైవేలలో మూడు హైవేలు హైదరాబాద్ సంబంధం ఉండటం విశేషం. హైదరాబాద్ నుంచి భద్రాచలం మీదుగా విశాఖపట్నానికి ఒక హైవేను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా 221 కి.మీ. మేర కొత్తగా హైవే నిర్మిస్తారు. 2025 మార్చి నాటికి దీని నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్-రాయ్పూర్ మధ్య మరో హైవేను నిర్మిస్తారు. దీని పొడవు 330 కి.మీ. ఇండోర్ హైదరాబాద్ నగరాల మధ్య 713 కి.మీ. పొడవైన హైవేను నిర్మించనున్నారు. రాయ్ పూర్-విశాఖ నగరాల మధ్య 464 కి.మీ. పొడవైన హైవేను నిర్మిస్తారు. తెలంగాణను తాకుతూ.. భద్రాచలం మీదుగా నాగ్ పూర్ విజయవాడ నగరాల మధ్య 457 కి.మీ. పొడవైన హైవేను నిర్మిస్తారు. సోలాపూర్-కర్నూలు నగరాల మధ్య నిర్మించనున్న హైవే కూడా తెలంగాణ మీదుగా వెళ్లనుంది.