Templates by BIGtheme NET
Home >> Telugu News >> వైఎస్సార్సీపీకి విజయమ్మ రాజీనామా!

వైఎస్సార్సీపీకి విజయమ్మ రాజీనామా!


అంతా ఊహించినట్టే జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె ఓవైపు వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోవైపు వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీకి గౌరవ అధ్యక్షురాలి హోదాలో ఉన్నారు. రెండు పదవుల్లో కొనసాగడం సరికాదని భావించడం వల్లే రాజీనామా చేస్తున్నట్టు విజయమ్మ చెబుతున్నారు.

తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి విజయమ్మ ఎక్కువ అక్కడే ఉంటున్నారు. తన కుమార్తె వైఎస్ షర్మిలకు అండదండలు అందిస్తున్నారు. వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం వైఎస్ జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదని ప్రభుత్వ సలహాదారు వైఎస్సార్సీపీలో నెంబర్ టూగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ ఏర్పాటు విషయంలో విజయమ్మ.. షర్మిలకే తన మద్దతు తెలిపారు.

ఈ క్రమంలో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మను.. జగన్ రాజీనామా చేయిస్తారని గతంలోనే వార్తలు వచ్చాయ. ఇందుకు వైఎస్సార్సీపీ ప్లీనరీ వేదిక అవుతుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో మీడియా రాజకీయ విశ్లేషకులు ఊహించినట్టే వైఎస్ విజయమ్మ వైఎస్సార్సీపీకి రాజీనామా సమర్పించారు. ఇక తాను వైఎస్ షర్మిలకు అండదండలు అందిస్తానని.. రెండు పార్టీలకు గౌరవ అధ్యక్షురాలిగా ఉండటం సముచితం కాదనే వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలిగా తప్పుకున్నానని విజయమ్మ చెబుతున్నారు. ఒక తల్లిగా జగన్ కు అండగా ఉంటానని విజయమ్మ అంటున్నారు.

ఈ మేరకు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరుగుతున్న వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు వారి అభిమానంతో పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని తెలిపారు. అధికార శక్తులన్నీ కలసి వచ్చి భయపెట్టాలని చూసినా నాడు జగన్ భయపడలేదన్నారు. అన్యాయంగా జగన్ పై కేసులు పెట్టి వేధించారని గుర్తు చేశారు. జగన్ సహనం ఓర్పుతో ఎంతో ఎత్తుకు ఎదిగారని కొనియాడారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడ్డాడన్నారు. యువతకు జగన్ ఒక రోల్ మోడల్ అని అభిప్రాయపడ్డారు. పాలనలో కూడా విప్లవాత్మక సంస్కరణలకు ప్రవేశపెట్టారని చెప్పారు. 1.60 లక్షల కోట్లను నేరుగా ప్రజలకు పథకాల రూపంలో అందించారని గుర్తు చేశారు. భవిష్యత్ లో జగన్ ను పేద కుటుంబాలు తమ బిడ్డగా చూసుకుంటాయని తెలిపారు.

కాగా వైఎస్ విజయమ్మ అంతకుముందు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ఘన నివాళులు అర్పించారు. జూలై 8న తన భర్త వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో కుమార్తె షర్మిల కుమారుడు జగన్ తో కలిసి పాల్గొన్నారు.