గంజాయిని చట్టబద్ధం చేయాలని కోరుతున్న హీరోయిన్…!

0

సినీ ఇండస్ట్రీని ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ మాఫియా వ్యవహారం శాండల్ వుడ్ కు పాకింది. మాదకద్రవ్యాల మాఫియాతో కన్నడ సీమలో పలువురు నటీనటులకు లింకులున్నాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు. నాని ‘జెండాపై కపిరాజు’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రాగిణి ద్వివేది ని అరెస్ట్ చేయడంతో పాటు ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజన కు నోటీసులు జారీ చేశారు. రాగిణి ద్వివేది ని విచారించిన పోలీసులు ఆమెకు డ్రగ్స్ మాఫియాతో లింకులున్నట్లు కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది. దీంతో సినీ ఇండస్ట్రీలో చాలామంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో హీరోయిన్ రాగిణి ద్వివేది అరెస్ట్ పై స్పదించిన ప్రముఖ కన్నడ నటి నివేదిత సంచలన వ్యాఖ్యలు చేసింది. గంజాయి కూడా తులసి మొక్కలాంటిదే అని.. మన దేశంలో దాని వినియోగాన్ని చట్టబద్ధం చేయాలని కోరింది. గంజాయిని బ్యాన్ చేయడానికి ముందు అది ఆయుర్వేదానికి వెన్నెముకలా ఉండేదని పేర్కొంది. మనదేశంలో నిషేధించిన మత్తు పదార్ధాల్లో ఒకటైన గంజాయిని పవిత్రంగా పూజించే తులసి తో పోల్చడమే కాకుండా దాని వినియోగాన్ని చట్టబద్ధం చేయాలని నివేదిత కోరడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పాము విషయంతో మందులు తయారు చేస్తామని.. పాముతో కాటు వేయించుకోము కదా అని కామెంట్స్ చేస్తున్నారు. కొంపదీసి గంజాయి తులసి లాంటిదని నువ్వు కూడా తీసుకుంటున్నావా అని ట్రోల్ చేస్తున్నారు. ‘తులసి వనంలో గంజాయి మొక్క’ అనేదాన్ని మార్చేసి ఆ గంజాయి మొక్కను కూడా మంచిదే అని చెప్తూ మత్తు పదార్థాలకు సపోర్ట్ చేస్తోందని విమర్శిస్తున్నారు.