అక్షయ్ మిషన్ ‘బెల్ బాటమ్’ పూర్తయింది…!

0

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తుంటాడు. స్టార్ హీరోలు ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేయడమే కష్టం అనుకుంటున్న ఈ రోజుల్లో అక్షయ్ మాత్రం తన దైన స్పీడుతో దూసుకెళ్తున్నాడు. గతేడాది ‘కేసరి’ ‘మిషన్ మంగళ్’ ‘హౌస్ ఫుల్ 4’ ‘గుడ్న్యూస్’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అక్షయ్.. ‘సూర్యవంశీ’ ‘లక్ష్మీబాంబ్’ ‘పృథ్వీరాజ్’ ‘బచ్చన్ పాండే’ ‘అత్రాంగి రే’ ‘రక్షాబంధన్’ సినిమాలు లైన్లో పెట్టాడు. ఇక ‘లక్ష్మీబాంబ్’ సినిమా త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. అదే క్రమంలో ”బెల్ బాటమ్” అనే సినిమా అనౌన్స్ చేసాడు అక్షయ్ కుమార్. 1980లో జరిగిన వాస్తవ సంఘటలన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ యూరప్ లో ప్లాన్ చేయగా కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే కేంద్రం లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో అక్షయ్ కుమార్ తన ‘బెల్ బాటమ్’ టీమ్ తో కలిసి ప్రైవేట్ జెట్ లో స్కాట్లాండ్ కు పయనమయ్యాడు. కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి తరువాత విదేశాలలో చిత్రీకరణ ప్రారంభించిన ఫస్ట్ ఇండియన్ మూవీ ‘బెల్ బాటమ్’ అని చెప్పవచ్చు.

అయితే విదేశాల్లో ఏదో కొన్ని కీలక సన్నివేశాలు తీసుకొని ఇండియాకి తిరిగొస్తారనుకుంటే.. ఏకంగా మొత్తం సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందంటూ తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే కొంత భాగం ఇండియాలో చిత్రీకరించిన చిత్ర బృందం.. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పగడ్బందీగా 40 రోజుల ఫారిన్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను విడుదల చేస్తూ 2021 ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. భారీ స్కేల్ లో రూపొందిస్తున్న ఈ సినిమాని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంత తక్కువ కాలంలో పూర్తి చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రంజిత్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వాణీ కపూర్ – లారా దత్తా – హ్యూమా ఖురేషి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘బెల్ బాటమ్’ చిత్రాన్ని వషూ భగ్నానీ – జాకీ భగ్నానీ – దీప్షికా దేశ్ముఖ్ – మోనీషా అద్వానీ – మధు భోజ్వానీ – నిఖిల్ అద్వానీ కలిసి నిర్మిస్తున్నారు. మిషన్ పూర్తయింది.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఇండియాకి తిరుగు ప్రయాణం అయ్యామని అక్షయ్ ట్వీట్ చేశాడు.