‘Rx100’ ఫేమ్ కార్తికేయ – లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ”చావు కబురు చల్లగా” సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచిన మేకర్స్ రెగ్యులర్ గా అప్డేట్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – టీజర్ మరియు లిరికల్ సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ‘చావు కబురు..’లో యాంకర్ అనసూయ భరద్వాజ్ స్టెప్పులేసిన స్పెషల్ సాంగ్ ‘పైన పటారం’ అనే ప్రోమోని విడుదల చేయగా అనూహ్య స్పందన తెచ్చుకుంది. దీంతో తాజాగా ఆ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
‘పుట్టువేళ తల్లికి నువ్వు పురిటి నొప్పివైతివి.. గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా’ అంటూ సాగిన ఈ పాటకు జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చారు. ‘పైన పటారం.. ఈడ లోన లోటారం.. విను బాసూ చెప్తాను ఈ లోకం యవ్వారం.. పైకి బంగారం.. లోన గూడు పుటారం.. కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం’ అంటూ లిరిసిస్ట్ సనారే తన సాహిత్యంతో లోకం తీరు తెలియజెప్తున్నారు. ఈ మాస్ సాంగ్ ని సింగర్స్ మంగిలి – సాకేత్ తమదైన శైలిలో ఆలపించారు. ఈ ఐటమ్ సాంగ్ కోసం జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో బస్తీ బాలరాజ్ కార్తికేయతో కలిసి అనసూయ రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. అనసూయ వేసిన ఔట్ అండ్ ఔట్ మాస్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి.
కాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు పెగళ్ళపాటి కౌశిక్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించగా.. జీఎమ్ శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు. శవాలను తరలించే వాహనం డ్రైవర్ గా కార్తికేయ.. లావణ్య త్రిపాఠి నర్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమని – మురళీ శర్మ – శ్రీకాంత్ అయ్యంగర్ – మహేష్ – భద్రం ఇతర పాత్రలు పోషించారు.