‘రాధే శ్యామ్’ లో యాంటీ క్లైమాక్స్..? ప్రేక్షకులు అంగీకరిస్తారా..?

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ డ్రామా ”రాధే శ్యామ్”. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్వచ్ఛమైన ప్రేమ కావ్యాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీ జ్యోతిష్యానికి సైన్స్ కు మధ్య సాగే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేసాయి. అయితే ‘రాధే శ్యామ్’లో యాంటీ క్లైమాక్స్ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇందులో క్లైమాక్స్ లో హీరో చనిపోతాడట. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ లో కూడా విషాదంతం అయిన ప్రేమికులను చూపించడంతో ఇది నిజమేనేమో అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది. ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్ లో రోమియో – జులియేట్.. సలీం – అనార్కలీ.. దేవదాసు – పార్వతీ.. వంటి అమర ప్రేమికులను చూపిస్తూ చివరకు ‘విక్రమాదిత్య – ప్రేరణ’ల ప్రేమ కావ్యంగా రూపొందుతోందని హింట్ ఇచ్చారు. అంటే ఇందులో కూడా విషాదంతమైన లవ్ స్టోరీనే చూపించబోతున్నారా అనే డౌట్ వస్తోంది.

తెలుగు సినిమాల్లో హీరో చనిపోతే ఆడియెన్స్ కి నచ్చుదు. అది కూడా స్టార్ హీరో క్యారక్టర్ చనిపోవాలని అసలు కోరుకోరు. ఒకవేళ అలాంటి యాంటీ క్లైమాక్స్ ఉన్న సినిమాలను చాలా వరకు తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారు. అయితే ఇప్పుడు ‘రాధే శ్యామ్’ లో చివర్లో హీరో చనిపోతాడనే టాక్ వినిపిస్తోంది. కాకపోతే వింటేజ్ లవ్ స్టోరీలో ఆ క్లైమాక్స్ ఆడియెన్స్ కి సరైన రీతిలో అర్థమయ్యేలా రెడీ చేస్తున్నట్లుగా టాక్. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. కాగా ‘రాధే శ్యామ్’ చిత్రం తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేస్తున్నారు. ఇందులో జగపతిబాబు – సత్యరాజ్ – భాగ్యశ్రీ – కునాల్ రాయ్ కపూర్ – సచిన్ ఖేడ్కర్ – మురళి శర్మ – శాషా ఛత్రి – ప్రియదర్శి – రిద్దికుమార్ – సత్యాన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.