ఆ డైరెక్టర్ పిలుపు కోసం స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నారా..?

0

దేశంలో లాక్ డౌన్ కారణంగా నాలుగు నెలల పైగా సినిమా షూటింగులు అన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వాలు షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేటి నుండి తెలంగాణలో షూటింగులు మొదలవ్వాల్సి ఉంది. టాలీవుడ్ లో మొత్తానికి షూటింగ్ కోసం అనుమతులు అయితే వెంటాడి వేటాడి తెచ్చుకున్నా.. ఇప్పట్లో షూటింగులు మొదలు పెట్టడానికి నిర్మాతలు మాత్రం సిద్దంగా లేరని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కానీ నిబంధనలు అధికంగా ఉండటమే దీనికి కారణమని అంటున్నారు. పోనీ అన్ని నిబంధనలు పాటించి షూటింగ్ చేయాలంటే రెండింతలు కష్టపడాలని.. ఖర్చు కూడా డబుల్ అవుతుందని నిర్మాతలు చెప్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య ప్రస్తుతం షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

కానీ టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం తక్కువ సిబ్బందితో ఆర్ఆర్ఆర్ షూట్ ప్లాన్ చేసి రెండు వందల మందికి పైగా చేయాల్సిన షూట్ యాభై మందితో చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనే ప్రస్తుతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. నిజానికి గత నెలలోనే షూటింగ్ జరగనుందని అంతా అనుకున్నారు. షూట్ అప్పుడు జరుగుతుందని కూడా సమాచారం లేదు. రాజమౌళి ట్రయిల్ షూట్ చేద్దామని రెడీ ఉన్నప్పుడు హీరోలు రాంచరణ్ ఎన్టీఆర్ కాస్త ఆగుదామని అన్నారట. కానీ ఇప్పుడు వాళ్లిద్దరూ రిస్క్ తీసుకొని అయినా షూటింగ్ చేద్దామని అనుకుంటే రాజమౌళి కరోనా కారణంగా ఇంకొన్ని వారాలు క్వారంటైన్ లో ఉండాల్సిందే. ఎన్ని జాగ్రత్తలు వహించినా కరోనా బారిన పడేవారు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి కోలుకోవాలని అంతా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత షూట్ విషయంలో క్లారిటీ రానుందట!