Templates by BIGtheme NET
Home >> Cinema News >> అప్పటికీ ఇప్పటికీ భూమిక అంతే!

అప్పటికీ ఇప్పటికీ భూమిక అంతే!


భూమిక .. వెండితెరపై నాజూకు సౌందర్యానికి నమూనా. లేత తమలపాకు వంటి అందానికి ఆనవాలు. కలువ మొగ్గల్లాంటి కళ్లు .. చెర్రీ పళ్లు పేర్చినట్టుండే పెదాలు .. పూతరేకులాంటి నాసిక .. వెన్నముద్దవంటి చిన్ని గెడ్డం .. భూమికకు ప్రత్యేక ఆకర్షణ. వేయి పున్నమిలా వెన్నెల ఒక్కసారిగా కురిసిన అనుభూతికి గురిచేసే భూమిక నవ్వు .. కుర్రకారు మనసు తెరపై మెరుస్తూనే ఉంటుంది. ఆమె చిలిపి చూపుల ధారలో పడుచు మనసు తడుస్తూనే ఉంటుంది. సాధారణంగా అందం .. అల్లరి కవల పిల్లల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. కానీ భూమిక విషయంలో మాత్రం అలా జరగలేదనే చెప్పాలి. కెరియర్ మొదటి నుంచి కూడా అవకాశాల విషయంలో కథలు .. పాత్రల ఎంపిక విషయంలో తొందరపాటు కనిపించదు. ఆమె అందం .. అభినయం .. హుందాతనంతో కలిసి కనిపిస్తాయి. ఆమె ఎంచుకునే పాత్రలు కూడా ఆమె వ్యక్తిత్వానికి దగ్గరగానే అనిపిస్తాయి.

భూమిక కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ‘ఖుషీ’ .. ‘ఒక్కడు’ ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తాయి. ఈ రెండు సినిమాల్లో ఆమె కడిగిన ముత్యంలా .. తొడిగిన పగడంలా కనిపిస్తుంది. ఆమె గ్లామర్ పై గ్రంథమే రాయవచ్చుననిపిస్తుంది. పంచదారతో చేసిన పల్చని పూతరేకులా తెరపై జారిపోయే ఈ అమ్మాయిని చూసి కుర్రాళ్లకు కుదురులేకుండా పోయింది. ఆ తరువాత తనచుట్టూ తిరిగే కథతో ‘మిస్సమ్మ’ చిత్రంలోను మెప్పించింది. ఈ పాత్ర కూడా ఆమె హుందాతనానికి అద్దం పడుతూ హృదయానికి దగ్గరగా వెళుతుంది. నాయిక ప్రాధాన్యం కలిగిన పాత్రలను భూమిక మోయగలదనే విషయాన్ని ఆమె చాలా తక్కువ కాలంలోనే నిరూపించింది.

భూమిక అంగీకరించిందంటే ఆ కథలో బలం .. ఆ పాత్రలో వైవిధ్యం ఉంటుందనే నమ్మకాన్ని అభిమానులకు కలిగించింది. ఆమె నటనలో ఎక్కడా ‘అతి’ కనిపించదు .. పాత్ర చుట్టూ కూడా ఒక పరిధిని గీసుకుని అది దాటకుండా ఆమె తన అభినయంలో సహజత్వాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకు ఉదాహరణంగా ‘అనసూయ’ సినిమాను చెప్పుకోవచ్చు. ‘సైకో’ నుంచి తప్పించుకునే పాత్రలో ఆమె చేసిన హావభావ విన్యాసం .. అసమానమైన ఆమె అభినయానికి కొలమానం అని చెప్పాలి. జయాపజయాలకు ఆమె ఎప్పుడూ అతీతంగానే వ్యవహరించింది. అలాగే హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె అంతే తేలికగా టర్న్ తీసుకుంది. ఆమె సాధించిన పరిణతికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

కథానాయికగా భూమికకు గల క్రేజ్ లో మార్పు వచ్చి ఉండవచ్చు .. ఆమె గ్లామర్ లో మార్పు వచ్చి ఉండవచ్చు .. ఆమె తీసుకునే పారితోషికంలో మార్పు వచ్చి ఉండవచ్చు. కానీ పాత్రల ఎంపిక విషయంలో మాత్రం ఆమె నిర్ణయం మారలేదు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలు .. ముఖ్యమైన పాత్రలు .. తన హుందాతనం తగ్గని పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వెళుతోంది. భూమిక ఏమీ మారలేదు .. అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉంది అనే ప్రశంసలను అందుకుంటోంది. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాలో నానీకి ‘వదిన’ పాత్ర .. ‘సవ్యసాచి’ సినిమాలో చైతూకి ‘అక్క’ పాత్ర అందుకు నిదర్శనంగా .. నిర్వచనంగా నిలుస్తున్నాయి.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి .. అయితే వాటిలో తనకి బాగా నచ్చినవాటినే ఆమె అంగీకరిస్తోంది. కొన్ని తమిళ సినిమాలకి .. మరికొన్ని తెలుగు సినిమాలకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగులో గోపీచంద్ హీరోగా చేస్తున్న ‘సీటీమార్’ సినిమాలోనూ ఆమె ఒక కీలకమైన పాత్రను చేస్తోంది. ఈ పాత్ర కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తమిళంలో ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా చేస్తున్న ‘కన్నై నంబతే’ అనే సినిమాలోను ఒక విభిన్నమైన పాత్రను చేస్తోంది. అందం .. అభినయం కలిగిన కథానాయికలు చాలామందే ఉన్నారు. కానీ ఆ రెండింటికీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని జోడించి కెరియర్ ను నడిపించే నాయికగా మాత్రం ఒక్క భూమికనే కనిపిస్తుంది. పారితోషికం గురించి కాకుండా పాత్రను గురించి మాత్రమే ఆలోచించి అడుగుముందుకు వేసే భూమికను ఎవరు మాత్రం అభినందించకుండా ఉండగలరు?