బిగ్గెస్ట్ అప్డేట్ : యంగ్ రెబల్ స్టార్ సినిమాలో బిగ్ బి అమితాబ్…!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. దక్షిణాది పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణే హీరోయిన్ గా నటించనుంది. ఈ మూవీ కోసం లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా వర్క్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్ట్ పై అంచనాలు తారా స్థాయికి చేరుకునేలా బిగ్ అప్డేట్ ని అందించింది చిత్ర యూనిట్. లెజెండరీ సినిమాని లెజెండ్ లేకుండా ఎలా నిర్మించగలం అంటూ బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ఇచ్చేసింది. ఈ భారీ చిత్రంలో ఇండియన్ లెజెండరీ నటులు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు.

కాగా సైన్స్ ఫిక్షనల్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ది ఫుల్ లెన్త్ రోల్ అని మేకర్స్ ప్రకటించారు. ”బచ్చన్ సర్ మా చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఈ చిత్రంలో ఆయనది పూర్తి నిడివి గల పాత్ర. లెజెండ్ అమితాబ్ ఈ పాత్రకు న్యాయం చేస్తాడని మేము నమ్ముతున్నాము” అని దర్శకుడు నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. యూనివర్సల్ కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. గత 50 ఏళ్లుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలను సినీ ప్రేక్షకులకు అందించిన వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ వారు ఈ చిత్రాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. స్వప్నదత్ – ప్రియాంకా దత్ కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించనున్నారు. డ్రీమ్ కాస్ట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందనున్న ఈ చిత్రం సినీ ప్రేమికులు మునుపెన్నడూ చూడని విధంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రం 2022లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.