స్వలింగ సంపర్కులను సమాజం చిన్న చూపు చూస్తుంది. వెలి వేసినట్టుగా ప్రజలు చూస్తారు. కానీ దానిని కోర్టులు ఖండించాయి. హిజ్రా లేదా స్వలింగ సంపర్కులకు సంఘంలో జీవించే హక్కు ఉందని వారి హక్కులకు భంగం కలిగిస్తే సంకెళ్లు తప్పవని కోర్టు తీర్పును వెలువరించింది. హిజ్రాల మనోభావాల్ని కించపరిచేందుకు ఎవరికీ హక్కులేదు.
ఇక హిజ్రా కాన్సెప్టులతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చి సంచలన విజయాలు సాధించాయి. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. ఆస్కార్ లు గెలుచుకున్నవి ఉన్నాయి. మన దేశం నుంచి ఆ రేంజుకు వెళ్లినవి ఉన్నాయి. అయితే అలాంటి ఓ గ్రేట్ కాన్సెప్టులో నటించేందుకు డార్లింగ్ ప్రభాస్ కి అవకాశం వచ్చిందా? అంటే అవుననే సమాచారం.
అంతర్జాతీయ సినీయవనికపై ఎన్నో అవార్డులు ప్రశంసలు పొందిన ది గ్రేట్ దీపా మెహతా తెరకెక్కించిన ఓ సినిమాలో తొలుత ప్రభాస్ కి అవకాశం దక్కింది. ఆమె దక్షిణాది స్టార్లతోనే ఈ సినిమాని తీయాలనుకున్నా చివరికి ఎవరూ అంగీకరించకపోవడంతో శ్రీలంక ఆర్టిస్టలతో ఆ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా టైటిల్ ‘ఫన్నీ బాయ్’. విమర్శకుల ప్రశంసలు పొందడమే గాక ఆస్కార్ ఎంట్రీకి వెళ్లిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమైంది. ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని మన ప్రభాస్ కోల్పోయారన్నది తాజా లీక్.
వైవిధ్యమైన కాన్సెప్టులతో ఆర్టిస్టుల జాతకాన్ని మార్చేసే సత్తా ఉన్న దీపా మెహతా ఇలాంటి ఆఫర్ ని ఇస్తే ప్రభాస్ కాదని అన్నారా? అంటే అసలు తన ఆఫర్ కి బాహుబలి స్టార్ స్పందించనేలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ని చాలాసార్లు పిలవడానికి ప్రయత్నించినా.. ఆ పిలుపునకు సమాధానం రాలేదట. దాంతో ఈ ఆలోచనను దీపా విరమించుకున్నారని తెలుస్తోంది.
ప్రభాస్ తర్వాత ఈ పాత్ర కోసం ఆర్.మాధవన్ .. సిద్ధార్థ్ లాంటి స్టార్లను దీపా మెహతా సంప్రదించారు. కానీ ఎవరూ అంగీకరించలేదు. ఆ క్రమంలోనే శ్రీలంకకు చెందిన స్టార్లతో సినిమాని పూర్తి చేసారట. స్వలింగ సంపర్కుడైన ఒక యువకుడు వాస్తవాన్ని అంగీకరించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అతడి కథేమిటన్నదే ఫన్నీబోయ్ సినిమా. అయితే దక్షిణాది స్టార్లు ఎవరూ ఇందులో నటించేందుకు ముందుకు రాలేదు.
ఇక ప్రభాస్ ఈ పాత్రలో నటించేందుకు అంగీకరించినా తన డైహార్డ్ ఫ్యాన్స్ అంగీకరిస్తారా? అంటే సందేహమే. పాన్ ఇండియా స్టార్ గా అతడికి ఉన్న పాపులారిటీ ఇమేజ్ కూడా ఇలాంటి ప్రయోగాలకు అడ్డంకి కావొచ్చు. అయితే యూనివర్శల్ ఆడియెన్ ని మెప్పించాలంటే ఏ స్టార్ అయినా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయాల్సి ఉంటుంది. మారుతున్న తెలుగు ఆడియెన్ ఫ్యాన్స్ మైండ్ సెట్ వగైరా కూడా ప్రయోగాలకు స్కోప్ పెంచుతున్నాయి. మునుముందు ప్రభాస్ ఇలాంటి సాహసాలు చేస్తారా? అన్నది వేచి చూడాలి.