Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘ఆచార్య’ అంచనాలు పెంచేసిన చందమామ

‘ఆచార్య’ అంచనాలు పెంచేసిన చందమామ


మెగా స్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్క తెలుగు ప్రేమికుడు కూడా ఎదురు చూస్తున్నాడు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా ను అపజయమే ఎరుగని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు చరణ్ కలిసి నటించడమే. గతంలో వీరిద్దరు రెండు మూడు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నా అది కొన్ని నిమిషాలు సెకన్లు మాత్రమే. కాని మొదటి సారి ఒక ఫుల్ లెంగ్త్ రోల్ ను చిరంజీవి సినిమా లో చరణ్ చేయడం జరిగింది. ఈ కారణాలన్నింటి వల్ల ఆచార్యపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సమయంలో చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ సినిమా పై ఆసక్తిని మరింతగా పెంచి ఇంకా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ ఎదురు చూసేలా చేసింది.

మోసగాళ్లు సినిమాలో విష్ణు కు అక్క పాత్రలో నటించిన కాజల్ అగర్వాల్ ఇటీవల ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా టాక్స్ లో ఆచార్య సినిమా గురించి మాట్లాడింది. సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ డ్రామా అని చిరంజీవి గారు అభిమానులను గతంలో ఎప్పుడు లేని విధంగా అలరిస్తారని పేర్కొన్నారు. ఇక చిరంజీవి గారు మరియు చరణ్ ల కాంబో సీన్స్ అద్బుతంగా ఉంటాయని చెప్పుకొచ్చింది. చిరంజీవి గారిని ఒక కొత్త పద్దతిలో అభిమానులకు నచ్చే విధంగా మాస్ లుక్ లో దర్శకులు కొరటాల శివ చూపించబోతున్నారు. తప్పకుండా ఆచార్య రాకింగ్ గా ఉంటుందని కాజల్ చెప్పుకొచ్చింది. ఆచార్యలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఆచార్య సినిమా ఈ ఏడాది మే 13న విడుదల కాబోతుంది.