షూటింగ్ లో యువ హీరోకి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..!

0

‘మారి 2’ ‘లూసిఫర్’ ‘ఫోరెన్సిక్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రముఖ మలయాళ నటుడు టోవినో థామస్ తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చేరారు. థామస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాలా’ షూటింగ్ లో భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయం పెద్దది కావడంతో ప్రస్తుతం ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కడుపులో బలంగా దెబ్బ తగలటంతో అతనికి ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టోవినో థామస్ ఐసీయూలో ఉండటంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై స్పందించిన థామస్ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై వదంతులను నమ్మవద్దని.. తామే అధికారిక ప్రకటనను ఇస్తామని వెల్లడించారు. టోవినో థామస్ కు ప్రమాదం జరిగిందనే న్యూస్ వైరల్ కావడంతో త్వరగా కోలుకోవాలని అందరూ సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. కాగా టోవినో థామస్ మలయాళ తమిళ్ చిత్రాల్లో నటించాడు. హీరోగా విలన్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. థామస్ నటించి ‘ఫోరెన్సిక్’ సినిమా ఇటీవల తెలుగులో ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అలానే ధనుష్ హీరోగా నటించిన ‘మారి 2’ సినిమాలో మెయిన్ విలన్ గా నటించాడు.