కలకత్తా బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ మూవీ…?

0

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా తర్వాత రెండు రీమేక్ చిత్రాల్లో నటించనున్నారు. వాటిలో ఒకటి మళయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ తెలుగు రీమేక్ కు మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. దీంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదలమ్’ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు చిరు. 2015లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన ఈ చిత్రం తమిళ్ లో ఘన విజయం సాధించింది. సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందని చిరంజీవి భావించి ఈ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించనున్నారని సమాచారం.

కాగా మెహర్ రమేష్ ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ మీద దాదాపు మూడేళ్ళ పాటు వర్క్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని అభిమానులకు ఏమి ఆశిస్తారో అన్ని అంశాలు ఉండేలా ఈ స్క్రిప్ట్ లో తగినన్ని మార్పులు చేశాడట మెహర్. అంతేకాకుండా స్టోరీని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చిన మెహర్.. ఇటీవల చిరంజీవికి కంప్లీట్ స్క్రిప్ట్ ని వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉన్న దర్శకుడు మెహర్.. ఈ చిత్రం కోసం కలకత్తా బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. గతంలో చిరంజీవి సూపర్ హిట్ ‘చూడాలని ఉంది’ సినిమా కూడా కలకత్తా నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే నేపథ్యంలో కీలక ఎపిసోడ్స్ షూట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో కీలమైన చెల్లెలి పాత్ర కోసం హీరోయిన్ సాయి పల్లవిని సంప్రదిస్తున్నారని సమాచారం. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తాడని వార్తలు వస్తున్నాయి.