‘సన్ ఆఫ్ ఇండియా’ గా మోహన్ బాబు…!

0

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ‘ఫాదర్ ఆఫ్ ది నేషన్’ అయితే నేను ‘సన్ ఆఫ్ ఇండియా’ అంటున్నాడు మోహన్ బాబు. విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు. గతంలో ‘మేజర్ చంద్రకాంత్’ ‘పుణ్యభూమి నా దేశం’ వంటి ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మంచు మోహన్ బాబు మరోసారి దేశభక్తిని చాటిచెప్పబోతున్నాడు.

కాగా ఈ టైటిల్ పోస్టర్ ని కూడా దేశభక్తి నేపథ్యంలో నడిచే కథ అని చెప్పే విధంగా డిజైన్ చేసారు. మోహన్ బాబు సీరియస్ లుక్ లో కనిపిస్తుండగా.. టైటిల్ లో అశోక చక్రం.. బ్యాగ్రౌండ్ లో ఇండియా మ్యాప్ కనిపించేలా పోస్టర్ రూపొందించారు. చాలా గ్యాప్ తీసుకొని సందేశాత్మక చిత్రంలో నటిస్తున్న మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఎలాంటి క్యారక్టర్ అయినా అవలీలగా పరకాయప్రవేశం చేసే మోహన్ బాబు కి ఈ చిత్రం ఎలాంటి గుర్తింపుని తీసుకొస్తుందో చూడాలి.

ఇక ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ‘బుర్రకథ’ చిత్రంతో దర్శకుడిగా ప్లాఫ్ అయినప్పటికీ డైమండ్ రత్నబాబు మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరోవైపు మంచు మోహన్ బాబు.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు.