లెజండరీ డైరెక్టర్ మణిరత్నం – రచయిత జయేందర్ పంచపకేశన్ కలసి ”నవరస” అనే వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నవరసాలను కథాంశంగా తీసుకొని తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలను – భావోద్వేగాలను ఇందులో చూపిస్తున్నారు. హాస్యం – శృంగారం – భయానకం – కరుణ – రౌద్రం – కోపం – ధైర్యం – అద్భుతం – బీభత్సం లాంటి మానవ జీవితంలోని నవరసాల ఎమోషన్స్ తో ‘నవరస’ ఆంథాలజీ సిరీస్ రూపొందింది. స్టార్ నటీనటులు – టాప్ టెక్నిషియన్స్ కలిసి వర్క్ చేస్తున్న ఈ సిరీస్ తో వెబ్ వరల్డ్ లో ఓ నూతన ఒరవడిని సృష్టించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన 9 ఫస్ట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘నవరస’ టీజర్ ను విడుదల చేస్తూ స్ట్రీమింగ్ డేట్ అనౌన్సమెంట్ ఇచ్చారు.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో వచ్చే నెల ఆగస్ట్ 6వ తేదీన ”నవరస” ఆంథాలజీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉంటూ విశేషంగా ఆకట్టుకుంటోంది. బ్లాక్ అండ్ వైట్ థీమ్ తో తొమ్మిది రకాల భావోద్వేగాలను ఈ టీజర్ లో చూపించారు. సూర్య – విజయ్ సేతుపతి – బాబీ సింహా – ప్రకాష్ రాజ్ – అరవింద్ స్వామి – బొమ్మరిల్లు సిద్ధార్థ్ – నిత్యా మీనన్ – ఐశ్వర్య రాజేష్ – విక్రాంత్ – గౌతమ్ కార్తీక్ – శ్రీరామ్ – అశోక్ సెల్వన్ – రేవతి – ప్రయాగా మార్టిన్ – డిల్లీ గణేష్ – రోహిణి – యోగిబాబు – అదితి బాలన్ – శ్రీరామ్ – రిత్విక – అభినయశ్రీ – అధర్వ మురళి – అంజలి – గౌతమ్ మీనన్ తదితరులు ఈ సిరీస్ లో నటించారు.
‘నవరస’ సిరీస్ లోని తొమ్మిది కథలను ప్రియదర్శన్ – గౌతమ్ మీనన్ – వసంత్ – కార్తీక్ సుబ్బరాజ్ – అరవింద్ స్వామి – సర్జున్ – కార్తిక్ నరేన్ – బెయోజ్ నంబియార్ – ఆర్.ఆర్ ప్రసాద్ వంటి 9 మంది సృజనాత్మక దర్శకులు రూపొందించారు. ఇప్పుడు తాజాగా విడుదలైన ‘నవరస’ టీజర్ ను భరత్ బాలా డైరెక్ట్ చేశారు. ఏఆర్ రెహమాన్ ఒరిజినల్ సాంగ్ ని కంపోజ్ చేశారు. సుదీప్ ఎలేమాన్ – విజయ్ కార్తీక్ కన్నన్ కలిసి సినిమాటోగ్రఫీ అందించగా.. క్రిస్టీ సెబాస్టియన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రేమ్ నివాస్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం మరియు జయేంద్ర పంచపకేషన్ కలిసి ఈ ఆంథాలజీ ఫిల్మ్ ని నిర్మించారు. కొవిడ్ సమయంలో ఇబ్బందులు పడ్డ సినీ కార్మికుల కోసం ఈ సిరీస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగిస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా మణిరత్నం – జయేంద్ర పంచపకేశన్ మాట్లాడుతూ “కరోనా వల్ల నష్ట పోయిన సినీ కార్మికుల కోసం ఏదో ఒకటి చేయాలనే బలమైన కోరికలో నుంచి ‘నవరస’ పుట్టింది. దీనికి ఇండస్ట్రీ ప్రముఖులంతా కలిసి వచ్చారు. కోవిడ్ ఎక్కువగా ఉన్న సమయంలో కఠిన నిబంధనలను పాటిస్తూ ఈ అంథాలజీలోని పూర్తి చేశాం. భూమిక ట్రస్ట్ ద్వారా చేయనున్న ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. 12 వేల మందికి దీని ద్వారా సహకారం అందించబోతున్నాం. ఈ ఎమోషనల్ జర్నీలో భాగమైన నెట్ ఫ్లిక్స్ సంస్థకు కృతజ్ఞతలు” అని అన్నారు. తొమ్మిది కథల సమాహారంగా తొమ్మిది భావోద్వేగాలతో రూపొందిన ”నవరస” సిరీస్ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.