పవన్ జన్మదిన వేడుకల్లో అపశృతి…ముగ్గురి మృతి

0

జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశృతి జరిగింది. పవన్ జన్మదినం సందర్భంగా బ్యానర్లు కడుతున్న అభిమానులు ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనలో మరో నలుగురికి తీవ్రగాయ్యాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురం మండలం కనమలదొడ్డిలో ఈ దుర్ఘటన జరిగింది. శాంతిపురం మండలంలోని ఏడవ మైల్ వద్ద కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై పవన్ కల్యాణ్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ షాక్ వల్ల సోమ శేఖర్ రాజేంద్ర అరుణాచలం అనే ముగ్గురు అభిమానులు మరణించారు. ఈ ఘటనపై పవన్ కల్యాన్ స్పందించారు. తన పట్ల గుండెల నిండా అభిమానం నింపుకొన్న కుప్పం నియోజకవర్గ జనసైనికులు శ్రీ సోమశేఖర్ శ్రీ రాజేంద్ర శ్రీ అరుణాచలం విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పవన్ అన్నారు. శాంతిపురం దగ్గర కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ తగలడంతో వారు చనిపోయారనే వార్త తన మనసుని కలచివేసిందన్నారు.

ఇది మాటలకు అందని విషాదం అని ఆ తల్లితండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలనని పవన్ అన్నారు. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేనని కనుక ఆ తల్లితండ్రులకు తానే ఒక బిడ్డగా నిలుస్తానని ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటానని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. తన అభిమానులు ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ ప్రార్థించారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక నాయకులకు తెలిపారు.కాగా ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కుప్పంలోని పిఈఎస్ మెడికల్ కాలేజ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సుమారు 25 అడుగుల ఎత్తులో నిలుచొని ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం సంభవించింది. మరణించిన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.