టాలీవుడ్ లో ఎవరూ చేయని సాహసాన్ని చేసిన ప్రణీత

0

దశాబ్డాలకు దశాబ్దాలుగా పీటముడి పడి ఉన్న అయోధ్య రామమందిరం పంచాయితీ ఒక కొలిక్కి రావటం.. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఎలాంటి అడ్డంకి లేకుండా పోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేయటం దేశ ప్రజల్ని ఆనందంలో ముంచెత్తింది. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందినోళ్లు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్న పరిస్థితి.

వాస్తవానికి భావోద్వేగాలకు చందిన అంశాల్లో సినీ తారలు ముందుకు వచ్చి భారీ విరాళాల్ని ప్రకటించటం తరచూ చేస్తుంటారు. అలాంటిది. అయోధ్య రామాలయానికి విరాళాలు ఇచ్చిన టాలీవుడ్ ప్రముఖులు పెద్దగా కనిపించరు. తాజాగా ఆ లోటును తీరుస్తూ.. టాలీవుడ్ భామ.. పెద్ద కళ్ల భామ ప్రణీత అయోధ్య రామాలయానికి రూ.లక్ష విరాళాన్ని ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే సినీ రంగానికి సంబంధించి అయోధ్య ఆలయానికి వచ్చిన మొదటి విరాళంగా చెప్పాలి.

ప్రణీత ఇచ్చింది లక్ష రూపాయిలే కావొచ్చు. కానీ.. ఈ మొత్తం మిగిలిన టాలీవుడ్ ప్రముఖులు స్పందించేలా చేస్తుందని చెప్పక తప్పదు. తనకు తానుగా రూ.లక్ష మొత్తాన్ని విరాళంగా ప్రకటించిన ప్రణీత.. అందరూ ముందుకు వచ్చి రామ మందిర నిర్మాణం కోసం విరాళాల్ని ప్రకటించాలని కోరారు.

హిందువులకు ఎంతో ప్రీతిపాత్రుడైన శ్రీరామ చంద్రుడి ఆలయాన్ని అత్యంత వైభోవపేతంగా నిర్మించాలని ట్రస్టు నిర్ణయించింది. ఇందుకోసం రామ మందిర్ నిధి పేరుతో భారీ ఎత్తున విరాళాల్ని సేకరిస్తోంది. ఇందులో భాగంగానే ప్రణీత రూ.లక్ష ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి.. మిగిలిన టాలీవుడ్ ప్రముఖుల సంగతేంటి? అన్న ప్రశ్నకు సమాధానం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.