సర్ప్రైజ్ ఇచ్చే హడావిడిలో తప్పులో కాలేసిన ‘రాధే శ్యామ్’ టీమ్…!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధే శ్యామ్” నుంచి ఈ రోజు ఉదయం న్యూ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టినరోజు(అక్టోబర్ 23) సందర్భంగా అడ్వాన్స్ విషెస్ తెలుపుతూ ఈ చిత్రంలో ఆయన విక్రమాదిత్య అనే పాత్రలో నటిస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు. వింటేజ్ కార్ మీద కూర్చుని ఉన్న ప్రభాస్ స్టైలిష్ లుక్ చూసి ఖుషీ అవుతున్న అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చే హడావిడిలో ‘రాధే శ్యామ్’ టీమ్ తప్పులో కాలేసినట్లు తెలుస్తోంది.

‘రాధే శ్యామ్’ నుంచి విడుదలైన ఈ పోస్టర్ ని తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్స్ లో సాంకేతిక నిపుణులను పేర్లు వెల్లడించిన మేకర్స్.. ‘రాధే శ్యామ్’ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ పేరు కూడా మెన్షన్ చేశారు. అయితే నిజానికి జస్టిన్ ప్రభాకర్ ‘రాధే శ్యామ్’ తెలుగు – తమిళం – మలయాళం – కన్నడ వెర్షన్స్ కి మాత్రమే సంగీతం సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్ కి వేరే మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయనున్నారు. అయితే మేకర్స్ మాత్రం హిందీ ఇంగ్లీష్ పోస్టర్స్ లో కూడా సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకర్ గా పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాస్త లేట్ గా గ్రహించిన చిత్ర యూనిట్ జరిగిన మిస్టేక్ ని సరిచేసి తాజాగా రివైజ్డ్ హిందీ ఇంగ్లీష్ పోస్టర్స్ ని విడుదల చేసింది. ఇందులో జస్టిన్ ప్రభాకర్ ని తీసేయబడి ఉంది. కాకపోతే ఈ పోస్టర్స్ లో కూడా హిందీ వర్షన్ కి ఎవరు సంగీతం అందిస్తారనేది ప్రకటించలేదు.

కాగా పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు. జగపతిబాబు – భాగ్యశ్రీ – జయరాం – సచిన్ ఖేడ్కర్ – భీనా బెనర్జీ – మురళీ శర్మ – శాషా ఛత్రి – ప్రియదర్శి – రిద్దికుమార్ – సత్యాన్ – కునాల్ రాయ్ కపూర్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అన్ని వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు.