సుమక్క తో రేణు దేశాయ్..!

0

బుల్లితెరపై సంచలనం సృష్టించిన యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాలను ఆరబోస్తూ యాంకరింగ్ చేస్తున్న యాంకర్లకు పోటీగా నిలుస్తూ తన మాటలనే పెట్టుబడిగా పెట్టి టాప్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ. అలానే యూట్యూబ్ లో ‘సుమక్క’ పేరుతో ఓ చానెల్ ను ప్రారంభించింది. కొద్ది రోజులకే బాగా పాపులర్ అయిన ఆ ఛానల్ లో సుమ వెరైటీ ప్రోగ్రామ్ లను అందిస్తోంది. అందులో ‘ఈట్ టాక్’ అనే స్పెషల్ షో కూడా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సెలబ్రిటీలను ఇంటికి పిలిచి ఏదో ఒక స్పెషల్ వంటకాన్ని వండిస్తూ ఉంటుంది. తాజాగా ప్రముఖ నటి దర్శకురాలు నిర్మాత రేణూ దేశాయ్ ని ఈ షోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

నటనకు కొన్నాళ్ళుగా దూరంగా ఉన్న రేణు దేశాయ్.. ”ఆద్య” అనే పవర్ ఫుల్ లేడి ఓరియెంటెడ్ పాన్ ఇండియా వెబ్ సిరీస్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టింది. అలానే రైతు సమస్యల నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పలు బుల్లితెర షో లకి గెస్టుగా వస్తూ అలరిస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు సుమ నిర్వహించే షో కి వచ్చింది రేణూ దేశాయ్. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ జరిగినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ మేరకు సుమ – రేణూ దేశాయ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా సుమ నడిపించే ఈ షోలో ఇంతకముందు సుధీర్ – ప్రదీప్ వంటి వారు పాల్గొన్నారు. సుధీర్ తో పులిహోర చేయించిన సుమ.. ప్రదీప్ తో మ్యాగీ చేయించింది. సరదాగా సాగిపోయే ఈ షో లో రేణూ దేశాయ్ ఎలా అలరిస్తుందో చూడాలి.